పార్వతీపురం: తగాదాలు వద్దని రాజీ మార్గమే శ్రేయస్కరమని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి.యజ్ఞ నారాయణ అన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. ఎటువంటి సమస్యలతో కోర్టులకు వెళ్లకూడదన్నారు. కుటుంబ సమస్యలు, వివాహ, ఆస్తి తగాదాలు వంటి సమస్యలను పెద్దవారితో చర్చించుకొని రాజీ చేసుకోవాలని కోరారు. ఎక్కువగా వివాహ తగాదాలు కోర్టుకు వస్తున్నాయని తెలిపారు. వివాహ వ్యవస్థ అనేది చాలా బలమైందని, భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండాలని చిన్న చిన్న సమస్యలను ఇరువురు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పరిష్కారం కానీ సమస్యలుంటేనే కోర్టుకు రావాలని తెలిపారు. కక్షిదారులు కోర్టుకు రాలేని పక్షంలో వారి లాయర్‌తో వీడియో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకటి, రెండు రోజుల్లో కక్షదారులు కోర్టుకు హాజరై సంతకం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.రమేష్, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ డి.సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ అదాలత్‌లో 1918 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో సివిల్ కేసులు 14, క్రిమినల్ కేసులు 1855, మోటార్ వెహికల్ కేసులు 13, బిఎస్‌ఎన్‌ఎల్, లిటికేషన్ కేసులు 33, ఎక్సైజ్ కేసులు 3 పరిష్కారం చేశారు. సివిల్ కేసులకు సంబంధించి రూ.5,58,713 వసూలు చేసి కక్షిదారులకు అందించారు.
308 కేసులు పరిష్కారం
కురుపాం : స్థానిక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించిన రాజీ తగ్గ కేసులను న్యాయమూర్తి డి.సౌజన్య, పార్వతీపురం న్యాయమూర్తి, మండల లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పార్వతీపురం కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఇందులో కురుపాం కోర్టుకు సంబంధించిన 302 ఎస్ టీసీ కేసులు, 6 క్రిమినల్ కాంపౌండర్ల్ కేసులతో కలుపుకుని మొత్తం 308 కేసులను పరిష్కారం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో లోక్ అథాలత్ సభ్యులు, న్యాయవాదులు కె. చంద్రశేఖర్, లావణ్య, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










