ప్రజాశక్తి-కొత్తచెరువు పదో తరగతి మూల్యాంకనం రేట్లను పెంపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.జయచంద్రారెడ్డి, కె.నాగేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యుటిఎఫ్ శాఖ పక్షాన నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.మీనాక్షిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోవ తరగతి మూల్యాంకనం నిర్వహిస్తున్న నేపథ్యంలో మూల్యాంకనం రేట్లు పెంచాలన్నారు. గత పిఆర్‌సిలో ఇచ్చిన రేట్లు పేపర్‌కు రూ.6.60 పైసలు అప్పుడు 50 మార్కులకు మాత్రమే ఒక పేపర్ ఉండేదన్నారు. ఇప్పుడు ఒక పేపర్ 100 మార్కులకు ఉన్నందున రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. మూల్యాంకనం సెంటర్‌లో మౌళిక వసతులను పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. 58 సంవత్సరములు పైబడిన ఉపాధ్యాయులను మూల్యాంక నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, గైనిక్ సమస్యలు గర్భిణులు, ఫీడింగ్ మదర్స్, వికలాంగులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. రంజాన్ మాసంలో రోజాలో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. వరండా అపాయింట్మెంట్ ద్వారా మూల్యాంకనం చేయు ఉపాధ్యాయులకు టిఏ, డీఏలు చెల్లించాలన్నారు. నాడు - నేడు ఫేస్-2 ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అపరిస్కతంగా ఉన్న సమస్యలు, సస్పెన్షన్లు, మెమోలు జారీ చేసిన వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. నాడు- నేడు ఫేస్-2లో భాగంగా ప్రధానోపాధ్యాయులు, స్థానిక నాయకుల ద్వారా మెటీరియల్ పర్చేజింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పై అధికారుల దష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు కందుకూరి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
డిఇఒ మీనాక్షికి వినతిపత్రం సమర్పిస్తున్న యుటిఎఫ్ నాయకులు










