
తెలుగు గంగ గేటు ఎత్తివేత
- నీటి విడుదల చేసిన నంద్యాల ఎంపీ, శ్రీశైలం ఎమ్మెల్యే
- హంద్రీనీవాకు నీటి విడుదల చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే
ప్రజాశక్తి - వెలుగోడు
వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (విబిఆర్) మద్రాస్ కాలువ ఒక గేటును ఎత్తి వేయి క్యూసెక్కుల నీటిని ఎథిక్స్ కమిటీ చైర్మన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి కిందకు గురువారం విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, ఆళ్లగడ్డ ఆపై ప్రాంతాలవారికీ రైతన్నల సాగు కోసం నీటిని విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. సరైన సమయంలో ప్రాజెక్టు నుండి రైతుల సాగు కోసం నీటిని విడుదల చేసినందుకు రైతన్నలు ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, తెలుగు గంగ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు.
హంద్రీనీవాకు నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే ఆర్థర్
నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని మల్యాల ఎత్తిపోతల హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి కెసి కాలువకు, హంద్రీనీవా కాలువకు బుధవారం జలవనరుల శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ రెండు పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. 700 క్యూసెక్కుల నీటిని కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం జిల్లా ప్రజల సాగు తాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. శ్రీశైలం జలాశయంలో 863 అడుగులకు నీటిమట్టం చేరుకోగానే హంద్రీనీవా నుంచి నీటి విడుదల చేశామన్నారు. ప్రతి ఏడాది హంద్రీనీవా నుంచి 40 టిఎంసిల నీటిని సరఫరా చేస్తున్నారన్నారు.










