ధర్మవరం టౌన్ : తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ కవి ఏలూరి ఎంగన్న పేర్కొన్నారు. ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సోమవారం నాడు గుర్రం జాషువా 52వ వర్థంతి సందర్బంగా ''తెలుగు భాష రక్షణ మనబాధ్యత'' అన్న అంశంపై ప్రధానోపాధ్యాయురాలు శైలజ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరి ఎంగన్న మాట్లాడుతూ తెలుగు కవులు వంటి ఘనులు.. తెలుగు తనం వంటి తియ్యదనం లేదన్నారు. తెలుగు ప్రపంచంలో 6వ స్థానం, దేశంలో 3వ స్థానంలో ఉందన్నారు. అయితే నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలుగు నిర్లక్ష్యానికి గురవుతోందని చెప్పారు. గిడుగు రామ్మూర్తి ఉద్యమస్ఫూర్తితో భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాషువా జీవితం, సాహిత్య కృషి అందరికీ ఆదర్శం కావాలని చెప్పారు. సాహితీ స్రవంతి కన్వీనర్ హరి మాట్లాడుతూ భాషా దినోత్సవాలు జరుపు కోవడం, ఆరోజు మాత్రమే భాష గొప్పతనం గురించి మాట్లాడుకోవడమే కాదని అమలుకు కషి చేయాలన్నారు. హిందీ పండితులు వేణుగోపాలచారి, ఊర్దూ టీచరు తెలుగు బాష గొప్ప తనం, ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










