Oct 19,2023 21:01

తరలుతున్న తెల్లబంగారం

తెల్లరాయి... తరలించేరు..!

ఎల్లలు దాటిస్తున్న 'అధికారం'
అడవిలో రాత్రిపూట తవ్వకాలు
'అంతేగా'అంటున్న అధికారులు
ప్రజాశక్తి -బాలాయపల్లి
రాత్రయితే చాలు తెల్లరాయి దొంగలు అడవిలో చొరబడుతున్నారు.. అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఎల్లలు దాటిస్తున్నారు. అటవీ, ప్రభుత్వ భూములను సైతం వదలకుండా కనిపించిన చోటల్లా ఎక్స్‌కవేటర్‌తో అక్రమంగా తవ్వకాలు చేసి లక్షలు ఆర్జిస్తున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో అటవీ, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో వైట్‌క్వార్డ్జ్‌ (తెల్లరాయి) వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తెల్ల ఖనిజాన్ని లారీల్లో, ఇతర వాహనాల్లో ఎల్లలు దాటిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. దీనివెనుక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాలాయిపల్లి మండలంలో కొన్నాళ్లుపోతే తెల్లరాయి కనుమరుగైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేస్తే 'చర్యలు తీసుకుంటాం' అని ఎపుడూ చెప్పే మాటే చెప్పి 'అంతేగా అంతేగా' అంటూ తలూపుతున్నారు.
తెల్లరాయికి విదేశాల్లో డిమాండ్‌
మండలంలోని నాయుడు చెరువు కండ్రిగ, పెండేరెడ్డి పల్లి గ్రామాల పరిధిలోని అడవిలో తెల్లరాయి నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలపై కన్నేసిన అక్రమార్కులు రాత్రివేళల్లో ఎక్స్‌కవేటర్‌తో విచ్చలవిడిగా ఖనిజాన్ని తవ్వితీస్తున్నారు. ఈ ప్రాంతాల్లో లభ్యమవుతున్న తెల్లరాయి నాణ్యతలో నెంబర్‌వన్‌గా ఉండటంతో విదేశాల్లో డిమాండ్‌తోపాటు మంచి ధర పలుకుతోంది. అడవిలో లభ్యమయ్యే ఈ తెల్లరాయికి మంచి ధర ఉంటుంది. సాధారణ రాయి అయితే టన్ను రూ.5వేలు. మొదటి శ్రేణి రాయి టన్ను రూ.25వేలు. ఇది ఒక టిప్పర్‌కి రూ.7.50 లక్షలు పలుకుతోంది. తెల్లరాయితో గాజు గ్లాసులు, గిన్నెలు తయారు చేస్తారు. ఇంకా రాయిని చిన్న చిన్న గుండ్రని రాళ్లుగా కత్తిరించి, నివాసాల్లోని పూలు, చెట్ల కుండీల్లో, అక్వేరియంలో ఉంచుతారు.. ఈ నేపథ్యంలో నాయుడు చెరువు కండ్రిగ, పెండేరెడ్డి పల్లి గ్రామాల్లో తాజాగా దివంగతులైన అధికారపార్టీ నేత కుమారుడు పేరుచెప్పుకుని తమకు ఆయన అండదండలు ఉన్నాయంటూ అధికారులను బెదిరిస్తూ, అడవుల్లో యథేచ్ఛగా అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
క్వారీని నిర్వహించాలంటే ముందుగా మైనింగ్‌ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత తహసీల్దార్‌ ద్వారా ఎన్‌వోసీ తీసుకోవాలి. మైనింగ్‌ అధికారుల నుంచి అనుమతి లభించాక క్వారీ పనులు చేపట్టాలి. భూమి నుంచి వెలికి తీసిన రాయికి టన్నేజీ ప్రకారం విలువకట్టి ప్రభుత్వానికి రుసుం చెల్లించాలి. కానీ ఎలాంటి అనుమతులూ లేకుండానే అక్రమంగా ఇక్కడ తెల్లరాయిని తవ్వుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న క్వారీల అనుమతి పత్రాలతో అక్రమంగా తరలిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి రావలసిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్నారు. అటవీ భూముల్లో యంత్రాల ద్వారా బావి ఆకారంలో గోతులు తీసి అందులో నుంచి రాయిని వెలికి తీస్తున్నారు. అనంతరం రోజువారీ కూలీల ద్వారా అవసరమైన మేరకు రాయిని సైజులుగా కొట్టిస్తున్నారు. దాన్ని రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా లారీలకు లోడ్‌ చేయించి చెన్నైకి తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. .
చర్యలు తీసుకుంటాం : తహశీల్దార్‌
మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిలో తెల్లరాయిని అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నట్టు మా దష్టికి వస్తే, వాహనాలు సీజ్‌ చేయడంతో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.
తరలుతున్న తెల్లబంగారం