Sep 26,2023 00:33
-ఊట గెడ్డల నీరే గిరిజనులకు ఆధారం

ప్రజాశక్తి-అనంతగిరి:c వేంగడ పంచాయతీ పరిధి డొంకపుట్టు, పెన్నంతి గ్రామాలలో దాహం కేకలతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయా గ్రామాలకు గత ఆరేళ్ల క్రితం వెలుగు సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్‌ మరమ్మతులకు గురి కావడంతో ఆయా గ్రామాల గిరిజన ప్రజలు గత్యంతరం లేక గ్రామాలకు కొంత దూరంలో ఉన్న ఊట నీటిని ఆశ్రయించవలసిన పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాలకు జల జీవన్‌ పథకం కింద ఇంటింటా కుళాయిల ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా సంబంధిత అధికారులు నేటి వరకు పనులను ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో గిరిజన ప్రజలు కలుషితమైన గెడ్డ నీటిని ఆశ్రయించి అనేక రోగులకు బారిన పడుతున్నారు. ఇప్పటికైనా పైపులైను మరమ్మత్తులు చేపట్టి మంజూరైన జల జీవన్‌ పథకం ద్వారా పనులు చేపటి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు
మండలంలోని వేంగడ పంచాయతీ పరిధి డొంకపుట్టు, పెన్నంతి గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ సర్పంచ్‌ సివెరి. కొండలరావు డిమాండ్‌ చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, పంచాయతీలో తాను అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారానికి పైపులైన్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మరమ్మతుకు గురు కావడంతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత్యంతరం లేక కలుషితమైన ఊట నీటిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెల కొందని, ఇప్పటికైనా అధికారులు మరమ్మతు చేపట్టాలని కోరారు.లేని పక్షాన గిరిజన ప్రజలతో మండల కేంద్రం వద్ద ఆర్డబ్ల్యూఎస్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపడ తామన్నారు.