ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : మండల పరిధిలోని భోగానిపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద కదిరి-హిందూపురం ప్రధాన రహదారిపై ఆగ్రామ మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొందని వాపోయారు. గ్రామంలోని బోరుబావిలో వస్తున్న అరకొర నీటితోనే సర్దుకుపోతున్నామన్నారు. ఆ బోరుబావి సైతం ఎండిపోవడంతో కొత్త బోరుబావిని తవ్వించమని స్థానిక సర్పంచుకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని స్థానిక అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చందన, సాలెమ్మ, ఉమాదేవి, వెంకటలక్ష్మమ్మ, రమణమ్మ, ఆదెమ్మ, నరసమ్మ, ఉత్తమ, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.










