May 24,2023 22:44

ఖాళీబిందెలతో రోడ్డుపై బైటాయించిన కాలనీవాసులు

ప్రజాశక్తి - గాండ్లపంట : తమ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మండల కేంద్రంలోని చాకలివీధి వాసులు స్థానిక గ్రామ సచివాలయ ఎదుట బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు రంగప్ప, చిన్న రమణ, గౌరీదేవి, రెడ్డమ్మ, చంద్రమ్మ తదితరులు మాట్లాడుతూ దాదాపు సంవత్సరం నుంచి తమ కాలనీలో తాగునీటి సమస్య నెలకొందన్నారు. సమస్యను పలు సార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిపిన ప్రయోజనం లేదన్నారు. నీరు పుష్కలంగా ఉన్నా పైపులైను సమస్యతో ఇబ్బంది పడుతున్నామన్నారు. గడపగడప మన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లగా స్పందించిన ఆయన వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిని ఇంతవరకు ఫలితం కన్పించలేదన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శి రఫీ, సర్పంచి రహమతుల్లా స్పందించి వెంటనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు