న్యూఢిల్లీ : బ్రిటీష్ కాలం నాటి చట్టమైన దేశద్రోహం (ఐపిసి 124ఏ సెక్షన్) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి) స్థానంలో కొత్త చట్టాన్ని భర్తీ చేస్తున్నప్పటికీ... 124ఎ సెక్షన్ కింద పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న వాస్తవాన్ని మార్చబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం శిక్షాస్మృతి నిబంధనల్లో మార్పులు చేర్పులు చేపడుతున్నందున ఈ పిటిషన్‌లను విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయడాన్ని వాయిదా వేయాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
సెక్షన్ 124ఎ ఐపిసిలో ఓ భాగం. ఈ సెక్షన్ కింద ఎలాంటి కేసులూ నమోదు చేయొద్దని, బ్రిటీష్ కాలం నాటి ఈ చట్టాన్ని సమీక్షించాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దేశద్రోహ చట్టాన్ని పున: పరిశీలించడానికి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సమయం కూడా ఇచ్చింది. భారతీయ న్యాయ సంహిత బిల్లులో సెక్షన్ 124 ఎ లేనప్పటికీ.. సెక్షన్ 150 ఉంది. కొత్త బిల్లులోని ఈ ప్రతిపాదిత నిబంధన 'దేశద్రోహి' అనే పదాన్ని వినియోగించకుండా అడ్డుకున్నప్పటికీ.. ఈ నేరాన్ని 'భారత సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం' అని వివరిస్తుంది.










