Jul 20,2023 15:39
  • జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్‌ పి.రాజాబాబు కోరారు. గురువారం కలెక్టరేట్‌ చాంబర్లలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ అధ్యక్షతన సవరణ ప్రక్రియ విధివిధానాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటా సర్వేలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పార్టీ తరుపున బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను నియమించి సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు.. నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తించడం, డోర్ నంబర్లు లేకుండా ఉన్న, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు పరిశీలన, సర్వీసు ఓటర్లు (మిలటరీ), ఎన్ఆర్ఐ ఓటర్ల వివరాలను సరిచేయడం, దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉందాల కనుక్కుని అక్కడ జాబితాలో ఉంచడం, ఒక బూత్లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూతు సిఫార్సు చేయడం, పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, స్పష్టత లేని ఫొటోలు తొలగించి, మంచి ఫోటోఏర్పాటు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు, చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం, ఓటర్ల అభ్యర్ధన మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం, కొత్తగా ఓటు హక్కు పొందని వారుంటే వారు ఓటు హక్కు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. సమగ్ర ఓటరు సర్వే  ద్వారా  నియోజకవర్గం మారినా, ఓటరు జాబితాలో పేర్లు లేకపోయినా, తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు  అలాగే, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడంతో పాటు 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండనున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.ఆగస్టు 22 తరువాత పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌, రాజకీయ పార్టీల సూచనల ఆమోదం మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబరు 30 నాటికి పూర్తిచేసి అక్టోబరు 17న ఓటరు జాబితా డ్రాఫ్ట్‌ రోల్‌ను ప్రచురించడం జరుగుతుందన్నారు. నవంబరు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనలకు అనుగుణంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.  ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ బి. వి. నారాయణ రెడ్డి , డిప్యూటీ తాహిసిల్దార్ శ్యాంబాబు,వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరుపున పర్ణం సతీష్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ తరఫున పెగ్గెం ప్రసాదరావు, బీజేపీ తరుపున పంతం వెంకట గజేంద్ర, సిపిఐ (ఎం) తరపున కొడాలి శర్మ,, కాంగ్రెస్ పార్టీ తరపున కోకా ఫణిభూషణ్, జనసేన పార్టీ తరుపున కొట్టే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.