May 07,2023 16:39
  • సోమవారం ఉదయం లోపు స్పష్టమైన ప్రకటన ఇవ్వకుంటే ఆందోళన తప్పదు : మాజీ ఉపసభాపతి మండలి 

ప్రజాశక్తి-మోపిదేవి : అకాల వర్షాలు కారణంగా పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆఫ్ లైన్ ద్వారా మిల్లులకు ధాన్యం తోలిన రైతులకు ఆన్లైన్ చేయాలని ఈ విషయమై సోమవారం ఉదయం లోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం మోపిదేవి మండలంలోని చిరువోలు, చిరువోల్లంక, కోసూరువారి పాలెం, నాగాయ్యతిప్ప, వార్పు ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న మెట్ట పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరువోలు గ్రామానికి చెందిన పలువురు రైతులు తాము పండించిన 100 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట సరిగ్గా కోతల సమయంలో కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిందని ఎకరా ఒక ఇంటికి రూ.30,000 పైగా ఖర్చు చేసిన తమకు నేడు కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు బుద్ధప్రసాద్ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ రైతులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన ఉంటుందని, తడిచి దెబ్బతిన్న మొక్కజొన్న పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకొస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం చిరువోల్లంక, కోసూరువారి పాలెం, నాగయతిప్ప గ్రామాల్లోని మెట్ట పంటలను పరిశీలించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామాలకు చెందిన బజ్జి మిర్చి రైతులు నేడు తాము కేజీ ఒక ఇంటికి రూ.5 కూడా దక్కడం లేదని, బస్తా కాయలు కోసేందుకు రూ.330లు ఖర్చు అవుతుంటే బస్తా అమితే కనీసం రూ.180  నుంచి రూ.200 వరకు కూడా రావాడం లేదని వాపోయారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ప్రభుత్వమే మార్కెట్ కమిటీల ద్వారా బజ్జి మిర్చిని కొనుగోలు చేసి జిల్లాలోని రైతు బజార్ల ద్వారా తెలంగాణకు చెందిన మార్కెట్లకు అమ్మి తమకు మద్దతు ధర ఇప్పించారని కానీ నేడు తాము ఇంత సంక్షోభంలో ఉంటే కనీసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమను కనీసం పలకరించలేదని వాపోయారు. దీనిపై బుద్ధప్రసాద్ స్పందిస్తూ బజ్జి మిర్చి రైతులు ఇంత సంక్షోభంలో కూరుకుపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని, రైతు భరోసా కేంద్రాలు అంటూ ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం ఈ రైతుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని ప్రశ్నించారు. 2017లో బజ్జి మిర్చి రైతులకు తాము మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటున్న సందర్భంలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారని కానీ ఇప్పుడు తన పాలనలో రైతు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతుంటే మౌనంగా ఉండటం దేనికి సంకేతం అని బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. రైతులందరికీ న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం వార్పు వద్ద వర్షాల కారణంగా దెబ్బతిన్న పసుపు పంటను బుద్ధప్రసాద్ పరిశీలించారు. వార్పు, కొక్కిలిగడ్డ, బొబ్బర్లంక, కే.కొత్తపాలెం ప్రాంతాలలోని పసుపు పంట వర్షాలకు పూర్తిగా పాడైపోయిందని, వారిని ఆదుకోవాలని బుద్ధప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. సోమవారంలోగా రైతాంగ సమస్యలపై స్పష్టమైన ప్రకటన రాకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు సోమవారం ఉదయం మోపిదేవిలో రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నామని ఇది రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న పోరాటానికి నాంది అని వెంటనే రైతులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన హామీ ఇస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బుద్ధ ప్రసాద్ హెచ్చరించారు. అయన వెంట పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.