- మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సభ్యులు సమావేశాన్ని బైకాట్
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : స్టాండింగ్ కమిటీ సమావేశాలకు సకాలంలో సమాచారం ఇవ్వకుండా తమను అవమానిస్తున్నారని దీనికి నిరసనగా శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని సభ్యులు బైకాట్ చేశారు. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యులు నయీమ్ పాషా, శ్రీనివాసరావు, సుజాత, సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి మునిసిపల్ కమిషనర్ భార్గవ తేజాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటుకు మూడు రోజుల ముందుగానే సమాచారం ఇస్తూ అజెండాను సభ్యులకు తెలియజేయాలని నిబంధనలు ఉన్నాయని కానీ తమన అవమానిస్తూ సమావేశం ఏర్పాటు సమయంలో మాత్రమే అజెండాను తమ ముందు ఉంచుతున్నారని ఇది సరికాదని అన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా తమను ఎన్నుకొని తమను అవమానించడం సమంజసం కాదని మండిపడ్డారు. ఇది భవిష్యత్తులో జరక్కుండా చూసుకోవాలని వారు కోరారు.










