అమెరికా-కేప్ కానావెరల్ : ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా.. సామాన్య పౌరులు కూడా అంతరిక్ష పర్యాటకం చేయవచ్చని అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ నిరూపించింది. సామాన్య పౌరులతో కూడిన ఓ ప్రైవేటు వాహకనౌక భూకక్ష్యలో ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనత స్పేస్ ఎక్స్ కు దక్కింది. అంతరిక్ష పర్యాటకాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా తొలి పౌర అంతరిక్షయానాన్ని చేపట్టింది. వాహకనౌకలో నింగిలోకి వెళ్ళిన ఆ నలుగురు మూడు రోజుల పాటు భూకక్ష్యలో ప్రయాణించనున్నారు. 'స్పేస్‌ఎక్స్ - ఇన్‌స్పిరేషన్ 4' పేరుతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8.02 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అంతకుముందు నలుగురుతో కూడిన వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగించిన వాహకనౌక అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ(ఐఎస్‌ఎస్) వరకు వెళ్లి తిరిగొచ్చారు.










