రాత్రిపగలు అని తేడా లేకుండా నిర్విరామంగా కష్టపడుతుండే చీమలు ఎప్పుడు నిద్రపోతాయో మీకు తెలుసా..! 12 గంటల కొకసారి 8 నిమిషాలపాటు విశ్రమిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎప్పుడూ తాజాగా..!
పదార్థాలేవైనా కొన్ని రోజులు, వారాలు, నెలలు రుచిగా ఉంటాయి. ఆ తర్వాత వాటి రుచి, వాసన, మన్నిక తగ్గిపోతుంది. పువ్వుల నుంచి తేనెటీగలు సేకరించిన తేనే మాత్రం ఎంతకాలమైనా దాని రుచి మారకుండా తాజాగా ఉంటుందట. తేనెటీగల కష్టం ఎంత తియ్యదనమో..!
పాదాలతో రుచి చూస్తే..!
పాదాలతో రుచి చూడటమా...! మనుషులకు ఇది వింతగా అనిపిస్తుంది. కానీ, సీతాకోకచిలుకలైతే రుచి చూసేందుకు పాదాలను వాడతాయి. ఆహారాన్ని గుర్తించటంలో సహాయపడే సెన్సార్లు వాటి పాదాల్లో ఉంటాయి. అందుకే అవి మొక్కలపై వాలుతుంటాయి.

కనుబొమ్మలు లేని మోనాలిసా
మోనాలిసా చిత్రం చూసిన ప్రతిసారి ఆమెకు కనుబొమ్మలు ఎందుకు లేవనే సందేహం చాలామందిలో మెదులుతుంటుంది. నిజానికి చిత్రకారుడు లియోనార్డో డావిన్సి మోనాలిసా చిత్రానికి కనుబొమ్మలు గీశారట. అయితే, కాలక్రమేణా ఆ చిత్రాన్ని శుభ్రపరిచే క్రమంలో కనుబొమ్మలు కనుమరుగయ్యాయని ఇంజనీర్ పాస్కల్ కనిపెట్టారు.

టంగ్ ప్రింట్స్...
ఈ ప్రపంచంలో ఒకరి చేతి వేలిముద్రలు వేరొకరి ముద్రలతో కలవనట్లే... నాలుక మీది ముద్రలు కూడా ఒకరి ముద్రలతో వేరొకరివి కలవవు.











