ప్రజాశక్తి-హిందూపురం : ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలో భాగంగా హిందూపురం పట్టణంలో బిపిఎల్ షోరూం ఎదురుగా నిరసన దీక్షను ఎస్ఎఫ్ఐ నాయకులు నిర్వహించారు. ఈ దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ ఎస్ఎఫ్ఐ నాయకులకు పులహరాలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలని ధర్నాలు చేస్తుంటే దున్నపోతు మీద వాన కురిసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతిపెద్ద పట్టణంగా ఉన్న హిందూపురంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా డిగ్రీ కళాశాల ఊసే లేకుండా పోయిందని, అరకొరగా అమ్మ ఒడి డబ్బులు ఇస్తూ చదువును కొనుక్కోమన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో ప్రారంభమై రెండు నెలలు ముగుస్తున్న ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని పోరాటాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని ఒకరోజు దీక్ష చేపడుతున్నామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఎస్ఎఫ్ఐ హిందూపురం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తరుణ్ చంద్రశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిలు హర్ష కుమార్, పవన్, సిఐటియు నాయకులు నరసింహప్ప రామకృష్ణ ఎస్ఎఫ్ఐ నాయకులు జై చంద్ర, లిఖిత్, రాజా, నిహాల్, వీరేష్ బాబా, ఫక్రుద్దీన్, రంగనాథ్, రవితేజ ,నందీష్ ,గిరీష్, లోకేష్ ,విశ్వ సూర్య ,గిరీష్ రామ్ ముదిరాజ్ పాల్గొన్నారు.










