Sep 24,2023 16:41

బెంగళూరు :   కర్ణాటకలో జెడి(ఎస్‌) అధ్యక్షుడు హెచ్‌.డి. కుమారస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. జెడి (ఎస్‌) ఉపాధ్యక్షుడైన సయ్యద్‌ షఫీవుల్లా పార్టీకి రాజీనామా చేశారు.  కులాలు, వర్గాల మధ్య చీలికలు తెచ్చే పార్టీతో జేడీ(ఎస్‌) చేతులుకలిపిందని, దీంతో ఇకపై పార్టీలో తాను కొనసాగడం కష్టమని అన్నారు.  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసేందుకు జెడి (ఎస్‌) ఇటీవల ఎన్‌డిఎ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే.

''గత 30 ఏళ్లుగా పార్టీతోనే ఉన్నా. మా పార్టీ సెక్యులర్‌ అన్న భావన ఉంది. ఇప్పుడు నా పార్టీ వర్గాలు, కులాల మధ్య చీలికలు సృష్టించే , మతపరమైన అజెండాను ప్రచారం చేసే పార్టీలో చేరింది.   సెక్యులర్‌ నేతలమైన మేం దానిని వ్యతిరేకిస్తున్నాం ’' అని ఆయన అన్నారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వ పాలనలో నెలకొన్న సమస్యలను సయ్యద్‌ షఫీవుల్లా ఈ సందర్భంగా ఎత్తి చూపారు. దేశం  అభివృద్ధి   చెందాల్సిన మార్గం అది కాదని,   ప్రజల మధ్య చిచ్చు పెట్టే బిజెపితో లౌకిక శక్తులు ఏకీభవించ లేవని అన్నారు. అలాంటి పార్టీలతో కొనసాగడం కష్టమని అన్నారు.