Sep 28,2023 08:18

బెంగళూరు : ప్రజలు అప్పులు చేసి మరీ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం మానుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. చామరాజనగర్‌లోని ఎం.ఎం. హిల్స్‌ ఆలయంలో నిర్వహించిన సామూహిక వివాహాల వేడుకకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు బయట రుణాలు తీసుకొచ్చి ఆర్భాటంగా పెళ్లిళ్లు చేయడం ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పారు. కొందరు వ్యవసాయ రుణాలు తీసుకొని సమాజంలో పేరు కోసం ఘనంగా వివాహాలు చేస్తున్నారన్నారు. పేద, శ్రామిక వర్గాల ప్రజలు ఆడంబరాల కోసం చేసిన అప్పులను తీర్చడానికి జీవితాంతం కష్టపడాల్సి వస్తోందన్నారు.