
చిత్తూరు అర్బన్ : యువత, పిల్లలు దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ఇదే సమయంలో పర్యావరణహితంగా ''స్వచ్ఛ దీపావళి- శుభ దీపావళి''లో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా తలపెట్టిన ''స్వచ్ఛ్ దీవాళీ - శుబ్ దీవాళీ'' స్ఫూర్తితో నగరంలోని ఆర్కే మోడల్ పాఠశాల విద్యార్థులు శుక్రవారం నగర కమిషనర్ డా. జె అరుణ, జిల్లా అటవీశాఖ అధికారి సి.చైతన్య కుమార్ రెడ్డిలతో కలసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీపావళి సందర్భంగా యువత, చిన్నారులు పర్యావరణహిత దీపావళిని నిర్వహించడానికి, గ్రీన్ దీపావళి జరుపుకోవాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా దీపాలు వెలిగించాలని, కాలుష్య కారకమైన, భారీ శబ్దాలను ఇచ్చే క్రాకర్స్ కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలన్నారు. చిన్నారుల స్ఫూర్తిని నగర కమిషనర్ అభినందించారు.ఉపాధ్యాయులు తులసి పాల్గొన్నారు.
స్మశానవాటికలో అభివృద్ధి పనులకు భూమి పూజ
నగరంలోని కైలాసపురం స్మశాన వాటికలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ ఎస్ అముద, కమిషనర్ డా. జె అరుణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని కైలాసపురం కైలాసధామంలో నగర ప్రజల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాల కల్పనకు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. స్మశాన వాటికలో గ్యాస్ ఆధారిత ఎలక్ట్రిక్ దహన వాటిక, ఇతరత్రా అభివద్ధి పనులను చేపట్టనున్నట్లు వివరించారు. అభివద్ధి పనుల్లో నగరపాలక సంస్థతో పాటు లైన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్, ఆర్యవైశ్య సంఘము, ఇతర సంఘాలు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. స్మశాన వాటికలో అభివద్ధి పనులకు లైన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్, ఆర్యవైశ్య సంఘాలు తమవంతు విరాళాలను అందించాయి.
దీపావళి అందరికీ శుభం కలగాలి : కమిషనర్
దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, అందరికీ శుభం కలగాలని నగర కమిషనర్ డా. జె అరుణ ఆకాంక్షించారు. ''స్వచ్ఛ దీపావళి శుభ దీపావళి'' కార్యక్రమంలో భాగంగా నగరపాలక ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మట్టి దీపపు ప్రమిదలను పంపిణీ చేశారు. పర్యావరణహిత దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, కార్యాలయ ఉద్యోగులు, వార్డు కార్యదర్శులు, స్థానిక ప్రజలకు దీపపు ప్రమిదలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంహెచ్వో డా. లోకేష్, సీఎంఎం గోపి, మేనేజర్ తనూజ, సానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.