అనంతపురం కలెక్టరేట్ : వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు సంక్షేమ సిఫార్సు ప్రధాత ఎంఎస్.స్వామినాథన్ మృతి సమాజానికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్.స్వామినాథన్ గురువారం అస్తమించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం టవర్‌క్లాక్ సర్కిల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక ఎస్‌ఎం.బాషా, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, ప్రముఖ సామాజికవేత్త బోసు, పాత్రికేయులు నాగరాజు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ హాజరై విశ్వనాథన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్.స్వామినాథన్ ఇక లేరన్న విషయం అందరినీ కలిచివేసే అంశం అన్నారు. ఆహారవద్ధిలో భారత్ స్వయం సమద్ధి సాధించేందుకు విశేష కషి చేశారని తెలిపారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయం గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయ పడిందన్నారు. స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎంఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారని తెలిపారు. దానిద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారని తెలిపారు. స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి స్వామినాథన్ అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ప్రతి రైతు సంక్షేమంలోనూ స్వామినాథన్ జీవించి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ వీరభద్రయ్య, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు సాకే హరి, సోమర రాహుల్, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్, జిల్లా కార్యదర్శి బాల రంగయ్య, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, ఆవాజ్ జిల్లా నాయకులు వలీ, సిపిఎం జిల్లా నాయకులు రామిరెడ్డి, ప్రకాష్, రైతు కూలి సంఘం జిల్లా నాయకులు నాగరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










