ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : స్థానిక సంస్థల్లో క్యాజువల్ వేకెన్సీస్ ఎన్నికలు నిర్వహణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ బంగ్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉయ్యూరు జడ్పీటీసీ స్థానానికి, ఉంగుటూరు మండలం తేలప్రోలు ఎంపీటీసీ స్థానానికి, జిల్లాలో 2 సర్పంచ్ స్థానాలు, 32 వార్డు మెంబర్ల స్థానాల ఖాళీలకు ఎన్నికల నిర్వహణకు త్వరలో నోటిఫికేషన్ జారీకానున్నదని, ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్కు అవసరమైన ఈవీఎంలు, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల ఎన్నికల పోలింగ్ కు అవసరమైన బ్యాలెట్ బాక్స్లు పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా సిద్ధం చేయాలని, వీటికి అదనంగా 10 శాతం రిజర్వ్ సిద్ధం చేయాలన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఆర్వో, ఏఆర్వో, పీఓ, ఏపీఓ, తదితర పోలింగ్ సిబ్బందిని నియమించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో ఎం.వెంక టేశ్వర్లు, జడ్ పి ఇంఛార్జి సీఈఓ జి.శ్రీనివాసరావు, కేఆర్ ఆర్ సీ డిప్యూటీ కలెక్టర్ బి.శివనారాయణ రెడ్డి పాల్గొన్నారు.










