Jul 14,2023 19:13

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
మండలంలోని పెద్దతుంబలం, పెద్దహరివాణం, బల్లేకల్‌, గణేకల్లు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. పెద్ద తుంబలంలో వెంకటేశులు, గనేకల్లు గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గసభ్యులు బి.వీరారెడ్డి, డి.రామాంజనేయులు, బల్లేకల్‌ గ్రామంలో మండల కమిటీ సభ్యులు జె.రామాంజనేయులు, పెద్దహరివాణం గ్రామంలో మండల నాయకులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వెంకటేశులు మాట్లాడారు. ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఆ గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రెయినేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెద్దతుంబలం, బల్లేకల్లు గ్రామాల్లో వీధుల్లో ఇళ్ల మధ్య, ఇళ్ల మీద వెళ్లిన విద్యుత్‌ తీగలను, ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలని కోరారు. గణేకల్‌ గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లాలంటే రైల్వే ట్రాక్‌ దాటాలని, ఈ నేపథ్యంలో అనేక ప్రమాదాలు సంభవించాయని తెలిపారు. పెద్దతుంబలం, గణేకల్లు గ్రామాల్లో జగనన్న కాలనీలో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గణేకల్లు గ్రామంలో జగనన్న కాలనీకి వెళ్లే దగ్గర వాగు మీద రెండు బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలని కోరారు. 1వ అంగన్వాడీ కేంద్ర భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని, పెద్దహరివాణం గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బాబునగర్‌లో సిసి రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని, పెద్దహరివాణం గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల నాయకులు హనుమంతు రెడ్డి, లక్ష్మన్న, పెద్దతుంబలం, గనేకల్లు, పెద్దహరివాణం గ్రామాల శాఖ కార్యదర్శులు ముత్తన్న, విరుపాక్షి పాల్గొన్నారు.