పాలకొండ : పాలకొండ రెవెన్యూ డివిజన్లో పాలన స్తంభించిందని చెప్పొచ్చు. డివిజన్‌కు కీలకమైన అధికారి సీటు ఖాళీగా ఉండడంతో రెవెన్యూ పనులు స్తంభించిపోయాయి. ఈ డివిజన్ పరిధిలో పాలకొండతో పాటు వీరఘట్టం, సీతంపేట, భామిని, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలు ఉన్నాయి. ఏడు మండలాలను పర్యవేక్షించే రెవెన్యూ అధికారి కొద్ది రోజుల నుంచి లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ కొద్ది రోజుల క్రితం ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ బాధ్యతలను పార్వతీపురం ఆర్‌డిఒకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమెకు పని ఒత్తిడి కారణంగా అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంటోంది.
స్పందన ఏదీ?
ప్రతి సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన స్పందన కార్యక్రమం గత మూడు వారాల నుండి జరగడం లేదు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సమస్య వినే అధికారి లేకపోవడంతో ప్రజలు నిరాశతో తిరిగిముఖం పడుతున్నారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపడుతున్న భూరీసర్వే పై కూడా దృష్టి పెట్టడానికి అధికారులు లేరనే చెప్పాలి. రెండో విడత డివిజన్‌లో 59 గ్రామాల్లో ఈ సర్వే జరుగుతున్నప్పటికీ మందకొడిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. డివిజన్ స్థాయి అధికారి లేకపోవడం వల్ల ఈ సర్వే అంతంత మాత్రంగానే జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సబ్ కలెక్టరా? ఆర్‌డిఒ
ఎంతో కాలం తర్వాత పాలకొండకు సబ్ కలెక్టర్‌ను నియమించారు. పది నెలల క్రితం ఐఎఎస్ స్థాయి అధికారిని ఇక్కడ సబ్ కలెక్టర్‌గా నియమించారు. ఐఎఎస్ అధికారి రావడంతో ప్రజలు కూడా సంతోషిం చారు. అనతి కాలంలోనే ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో మళ్లీ ఐఎఎస్ అధికారిని నియమిస్తారా లేదా ఆర్‌డిఒ స్థాయి అధికారిని నియమిస్తారా అనేది అందరిలో చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకులు మాత్రం ఆర్‌డిఒ స్థాయి అధికారిని నియమిస్తారనే ప్రచారం చేస్తుంటే ప్రజలు మాత్రం ఐఎఎస్ స్థాయి అధికారిని నియమించాలని కోరుతున్నారు.










