Sep 24,2023 21:23

భగత్‌సింగ్‌కు నివాళ్లు అర్పిస్తున సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - సాలూరు : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాధం పిలుపునిచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఆరు జిల్లాల్లో సిపిఎంం చేపట్టిన బైక్‌ యాత్ర ఆదివారం సాయంత్రం పట్టణానికి చేరింది. బంగారమ్మపేటలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం మాజీ ఎమ్మెల్యే కొరటాల సత్యనారాయణ శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బంగారమ్మ పేట, కోట వీధి, వెంకటేశ్వరా డీలక్స్‌ సెంటర్‌, గాంధీనగర్‌, శివాజీ సెంటర్‌, బోసుబొమ్మ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో లోకనాధం మాట్లాడుతూ ఎంతోమంది బలిదానాలతో ఏర్పడిన స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయాలని మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఉక్కు పరిశ్రమ ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా వుందన్నారు. స్టీల్‌ పరిరక్షణ కోసం ఉత్తరాంద్ర జిల్లాల్లో ప్రజలను చైతన్య పరచడానికే బైక్‌ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 29న విశాఖ లో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా నాయకులు జగన్‌, శ్రీకాకుళం జిల్లా నాయకులు తిరుపతిరావు, మన్యం జిల్లా నాయకులు ఇందిర, మన్మధరావు, పాచిపెంట మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు, సాలూరు మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కురుపాం : స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నుంచి కాపాడుకుందామని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం చేపట్టిన బైక్‌యాత్ర ఆదివారం కురుపాం చేరుకుంది. తొలుత కురుపాం పెట్రోల్‌ బంకు నుంచి రావాడ జంక్షన్‌ వరకు బైక్‌ యాత్ర సాగింది. అనంతరం సిపిఎం జిల్లా కమిటీసభ్యులు మండంగి రమణ ఆధ్వర్యంలో జరిగిన సభలో వేణు మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ వల్లే ఉత్తరాంధ్రలో వలసలు తగ్గాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను మోడీ సర్కారు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని, ఆదానీ పోర్టుకు ఉపయోగపడేలా స్టీల్‌ప్లాంట్‌ను మార్చేసిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ కుట్రకు పాల్పడుతుంటే రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన నోరు మెదపడం లేదని విమర్శించారు. స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ అధ్యక్షులు పి.కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటినీ ప్రయివేటుపరం చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం, విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్‌, స్టీల్‌ ప్లాంట్‌ జనరల్‌ సెక్రెటరీ కెఎం శ్రీనివాస్‌, స్థానిక సిపిఎం నాయకులు కోలక అవినాష్‌, ఎం.శ్రీనివాసరావు, కొల్లి గంగ నాయడు, తిరుపతిరావు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వీరఘట్టం : స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ బైక్‌ర్యాలీ ఆదివారం ఉదయం మండల కేంద్రానికి చేరుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ నిర్వహణకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని, సొంత గనులు కేటాయించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, తదితర అంశాలపై పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి థియేటర్‌ నుంచి వట్టిగెడ్డ వంతెన వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, కార్యదర్శివర్గసభ్యులు ఎం.తిరుపతిరావు, కె.గంగునాయుడు, సింహాచలం, వై.ప్రసాదరావు ఎన్‌.ప్రసాదరావు, పి.ప్రసాదరావు, నాయకులు పాల్గొన్నారు.
సీతానగరం : ఉక్కు రక్షణ బైక్‌ యాత్రకు సీతానగరంలో సిపిఎం నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ ర్యాలీ చినబోగిలి, మక్కువ మీదుగా సాలూరుకు చేరుకుంది.
సాలూరు రూరల్‌ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకై ఉక్కు రక్షణయాత్ర మండలంలో అన్నంరాజువలస, మామిడిపల్లి, బొడ్డవలస బంగారమ్మ పేట గ్రామాలు మీదుగా సాలూరు పట్టణానికి చేరుకుంది. బైక్‌ యాత్రలో స్థానిక సిపిఎం నాయకులు మర్రి శ్రీనివాసరావు, కోరాడ ఈశ్వరరావు, గాసి, మన్మధ, పండు తదితరులు పాల్గొన్నారు.
ఉక్కురక్షణ బైక్‌యాత్రకు అపూర్వ స్వాగతం
ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌
విశాఖ స్టీలుప్లాంట్‌ పరిరక్షణకై ఉక్కురక్షణ యాత్రపేరిట ఈనెల 20నుంచి 29 వరకు జరుగుతున్న ఉత్తరాంధ్ర బైక్‌ యాత్ర ఆదివారం పార్వతీపురంలోకి ప్రవేశించింది. పార్వతీపురం ముఖద్వారం అడ్డాపుశిలలో సిపిఎం మండల నాయకులు బంటు దాసు ఆధ్వర్యంలో ఉక్కు రక్షణ యాత్ర సారధి కె.లోకనాధం, ఆయనతో పాటు అలుపెరుగక ప్రయాణిస్తున్న నాయకులు, కార్యకర్తలకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. సిఐటియు ఉపాధ్యక్షులు వి.ఇందిర, ఐద్వా నాయకులు లక్ష్మి తిలకందిద్ది ఆహ్వానించారు. అనంతరం ర్యాలీ పార్వతీపురం పాత బస్టాండ్‌ కూడలికి చేరుకోగా, స్థానిక అటోవర్కర్స్‌ సంఘం యాత్రలో పాల్గొన్న వారందరిపైనా పూలవర్షం కురిపించి మద్దతు పలికారు. అనంతరం నెహ్రూ మున్సిపల్‌ మార్కెట్‌ అవరణలోకి భగత్‌సింగ్‌ విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్‌సింగ్‌ స్పూర్తితో ఈయాత్రను కొనసాగిస్తామని తెలిపారు. ఆ తర్వాత పార్వతీపురం ప్రధాన రహదారి గుండా ఎర్రజండాలతో సాగిన ర్యాలీకి ప్రజల నుండి అపూర్వ స్పందన కనిపించింది. స్థానిక ఆర్టీసి కాంపెక్స్‌ కూడలికి చేరుకున్న నాయకులకు కార్యకర్తలు నృత్యాలు చేస్తూ స్వాగతం పలుకగా, ఉక్కు రక్షణ యాత్ర నాయకులు వారితో కలిసి డాన్స్‌లు చేస్తూ వారిని ఉత్సాహపర్చారు. ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ప్రజలను ఆలోచింపజేశాయి. అనంతరం జరిగిన సమావేశంలో బైక్‌యాత్ర, లక్ష్యం, ఉద్ధేశ్యాలు, విశాఖ స్టీలుప్లాంట్‌ పరిరక్షణ ఆవశ్యకత, అవసరాన్ని వివరిస్తూ లోకనాధంతో పాటు నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి శ్రీదేవి, వై.మన్మధరావు, జి.వెంకటరమణ, బివి రమణ, బి.సూరిబాబు, పాకల సన్యాసిరావు, సంచాన ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం నాయకులు టితిరుపతిరావు, విశాఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.