Sep 01,2023 21:52

వ్యవసాయం

       అనంతపురం ప్రతినిధి : కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో అత్యంత దుర్భిక్ష సంవత్సరంగా ఈ ఏడాది నిలిచిపోనుంది. శతాబ్ధాల కరువు చరిత్రలో ఆగస్టు నెలలో అత్యల్ప వర్షపాతం పడిన సంవత్సరం ఇదే కావడం గమనార్హం. గడిచిన వంద సంవత్సరాల్లో ఎన్నడూ ఈసారిలాగా తక్కువ వర్షపాతం నమోదయిన దాఖలాల్లేవు. జూన్‌, జులైల్లో సరిగా వానలు లేకపోయినా, ఆగస్టు, సెప్టంబరు మాసాల్లో ఎంతో కొంత వర్షపాతం నమోదయ్యేది. కాని ఈ సంవత్సరం చినుకుజాడ లేకుండా పోయింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
ఖరీఫ్‌ వర్షాధార పంటకు అత్యంత అవసరమైన మాసం ఆగస్టు మాసమే. వర్షాధారం కింద సీజన్‌లో సాగైన పంట పూత వచ్చి, ఊడలు దిగే సమయం. ఈ సమయంలో వర్షమెస్తే ఎంతోకొంత వరకైనా పంట చేతికొస్తుంది. కాని ఈ ఏడాది ఆగస్టు మాసంలో చూస్తే అత్యల్పంగా 83.7 శాతం వర్షపాత లోటుంది. సాధారణంగా 83.8 మల్లిమీటర్లు వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది. కాని పడింది మాత్రం 13.7 మిల్లీమీటర్లు మాత్రమే. ఇది కూడా కేవలం పది మండలాల్లో ఒకటి నుంచి రెండు మిల్లీమీటర్లలోపు పడింది. తక్కిన అన్ని మండలాల్లోనూ నెల మొత్తం చినుకు జాడలేదు. మొత్తం జూన్‌లో సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి నైరుతి రుతుపవనాల కాలంలో ఇప్పటి వరకు సాధారణంగా 210 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 135.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. 35.7 శాతం వర్షపాత లోటుంది. అనంతపురం జిల్లా పరిధిలో 31 మండలాలకుగానూ 24 మండలాల్లో వరాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
63 సంవత్సరాల్లో ఐదు అత్యంత దుర్భిక్ష సంవత్సరాలు
        జూన్‌ నుంచి సెప్టంబరు వరకు ఈ నాలుగు మాసాల కాలంలో నైరుతి రుతుపవనాల కాలంగా భావిస్తారు. అప్పటి వరకు అరేబియా సముద్రం వైపు నుంచి వచ్చే గాలులతో వర్షాలు పడటం పరిపాటి ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు అక్టోబరు నుంచి మొదలవుతాయి. ఇవి బంగాళతం నుంచి వస్తాయి. అనంతపురం జిల్లాకు మాత్రం నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలు అధికంగా వస్తాయి. జూన్‌ నుంచి వచ్చే ఏడాది మే వరకు ఏడాది కాలంలో 512 మిల్లీమీర్లు ఉంది. ఇందులో నైరుతి రుతుపవనాల కాలంలోనే 319 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. తక్కిన 193 మిల్లీమీటర్లు అక్టోబరు, నవంబరు మాసాల్లోనే అత్యధికంగా వస్తుంది. ఆ తరువాతి కాలాల్లో వర్షపాతం తక్కువనే ఉంటుంది. ఈ రకంగా చూసినప్పుడు 1960వ సంవత్సరం నుంచి 2023 వరకు చూస్తే ఐదు సంవత్సరాల్లో నైరుతి వర్షపాతం 50 శాతం లోటుతో పడటం గమనార్హం. 1994-95 సంవత్సరంలో నైరుతి కాలంలో సాధారణ వర్షపాతం 297 మిల్లీమీటర్లకుగానూ 129 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యింది. సాధారణం కంటే 57 శాతం వర్షపాతం లోటుంది. ఆ తరువాతి నుంచి 2002-03 సంవత్సరంలో 338 మిల్లీమీటర్లకుగానూ 180 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. సాధారణం కంటే 53 శాతం వర్షపాతం లోటుంది. 2003-04 సంవత్సరంలో 338 మిల్లీమీటర్లకుగానూ 158 మిల్లీమీటర్లు పడింది. 47 శాతం వర్షపాతం లోటుంది. 2018-19 సంవత్సరంలో 338.4 మిల్లీమీటర్లకుగానూ 212.6 మిల్లీమీటర్లు పడింది. 37.4 శాతం లోటు ఏర్పడింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే 210 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 135. మిల్లీమీటర్లు మాత్రమే పడింది. 35.7 శాతం లోటుంది.
శతాబ్ధకాలంలో ఆగస్టులో ఇదే అత్యల్పం
అశోక్‌ కుమార్‌, సీనియర్‌ శాస్త్రవేత్త, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం.

       ఆగస్టు మాసంలో దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. దేశ వ్యాప్తంగా సగటు 40 శాతం వర్షపాతం లోటుంది. ఇక అనంతపురం జిల్లా వరకు వస్తే 83.7 శాతం లోటుంది. మొత్తం సంవత్సరాల్లో చూస్తే ఈ ఏడాదే అత్యల్ప వర్షపాతం కలిగిన సంవత్సరంగా భావిస్తున్నాం. సెప్టంబరులో 14లోపు అల్పపీడనం ఏర్పడి వర్షాలొచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ కాలంలో ఒక వర్షమెచ్చిన రైతులకు కొంత ఊపశమనం ఉంటుంది. ఇక 14లోపు పడకపోతే ఈ నెల కూడా వర్షాభావ పరిస్థితులే ఉండనున్నాయి.