Sep 03,2023 19:33

సర్వే నెంబర్లు మార్చిన అటవీభూమి

గరుగుబిల్లి: రెవెన్యూ అధికారుల లీలలు రైతులనే కాదు అటవీశాఖాధికారులకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా గొట్టివలస వద్ద అసైన్డ్‌ భూములు రైతుల నుంచి వెనక్కి తీసుకున్న ఘటనలో అటవీశాఖను దోషిగా నిలబెట్టేలా చేసింది రెవెన్యూ శాఖ. ఇలా రెవెన్యూ శాఖ చేతిలో మోసపోవడం అటవీశాఖకు మామూలుగా మారిపోయింది. అదే సమయంలో రెవెన్యూ అధికారుల అసంబద్ధ నిర్ణయం వల్ల 20 మంది రైతుల జీవితాలను రోడ్డు పాల్జేసింది. ఉపాధి నిమిత్తం 2008లో 20 మంది రైతులకు 20 ఎకరాల వరకూ అప్పటి ప్రభుత్వం అసైన్డ్‌ భూములను అందజేసింది. 15 ఏళ్ల నుంచి సాగులో ఉన్న భూములను ఉన్నపళంగా వెనక్కి తీసుకోవడంతో ఆ రైతులంతా రోడ్డునపడ్డారు. అసైన్డ్‌ భూముల చట్టం అనుసరించి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా అధికారులు ముఖం చాటేశారు.
2008లో అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం అసైన్డ్‌ భూములను పేద రైతులకు అందజేసింది. దీనిలో భాగంగా మండలంలో గొట్టివలస రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 272, 273, 274లో గల 20 ఎకరాల వరకు 20 మంది రైతులకు అప్పట్లో పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించి ఆయా రైతుల పేరున పట్టాలు సైతం అప్పుడే అందజేశారు. అప్పటి నుంచి 15 ఏళ్లగా ఆ భూముల్లో జీడి, మామిడి పంటలు, టేకు సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పంటల నుంచి రైతులకు దిగుబడి సైతం అందుతోంది. చావు కబురు చల్లాగా చెప్పినట్లు అసైన్డ్‌ భూములను చెప్పా పెట్టకుండా రైతుల నుంచి తిరిగి తీసుకుంటున్నట్లు అటవీశాఖాధికారులు సెలవిచ్చారు. దీంతో ఏమిచేయాలో పాలుపోక రైతులు జిల్లా అధికారులను ఆశ్రయించారు.
అక్కడి భూములకు బదులుగా...
సాలూరు, పాచిపెంట, కొమరాడ మండలాల గిరిజన ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి అటవీశాఖ నుంచి 79.58 ఎకరాలను రెవెన్యూ అధికారులు తీసుకున్నట్లు తెలిసింది. ఆ భూములకు సమానంగా గొట్టివలసలో రైతుల సాగులో ఉన్న భూములను ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు సిద్ధపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గొట్టివలస రెవెన్యూ పరిధి లో 279 సర్వే నెంబర్‌ పేరుతో 79.58 ఎకరాలను అప్పగించడానికి రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. వాస్తవంగా చూస్తే, రైతులకిచ్చిన అసైన్డ్‌ భూములు గొట్టివలస రెవెన్యూ పరిధిలో 272, 273, 274 సర్వే నెంబర్‌ లో ఉన్నాయి. వాటిని కూడా రెవెన్యూ అధికారులు 279 సర్వే నెంబరుగా చూపించి, అటవీశాఖ ఇస్తూ రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.
నాలుగేళ్ల కిందటే బీజం...
రైతులకిచ్చిన అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకుని, అటవీశాఖకు అందజేయాలని నాలుగేళ్ల కిందటే మండల రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలను అప్పటి తహశీల్దార్‌ శర్మ తయారు చేసి, ఉన్నతాధికారులకు అందజేశారు. ఇపుడు ఆ ప్రతిపాదనలను అమలు చేశారు. ఆరు నెలల కిందట అటవీశాఖాధికారులు అసైన్డ్‌ భూముల్లోకి వచ్చి సర్వే రాళ్లు వేయసాగారు. అప్పట్లోనే రైతులు సర్వే రాళ్ల పాతడాన్ని అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఈవిషయం నలుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట అసైన్డ్‌ భూముల పరిశీలనకు అటశీఖాధికారులు రావడంతో రైతులు ఘెరావ్‌ చేశారు.
మభ్యపెట్టి మోసం చేసి...
రైతులు అడ్డుకుంటారని ముందే గ్రహించిన రెవెన్యూ అధికారులు కొత్త సర్వే నెంబర్‌ 279ను సృష్టించారు. ఆ నెంబర్‌ లో 79.85 ఎకరాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త సర్వే నెంబర్‌ విషయం దాచిపెట్టి, రైతులు ఫిర్యాదు చేసిన ప్రతిసారీ సేకరించిన భూములు 279 సర్వే నెంబర్లలో ఉన్నాయని, ఆ భూములు మీవి కావంటూ అధికారులు చెప్పసాగారు. అదే సమయంలో భూముల పరిశీలనకొచ్చిన అటవీశాఖాధికారులను రైతులు అడ్డుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ, అటవీశాఖాధికారులు కలిసి రైతులకిచ్చిన అసైన్డ్‌ భూములను సర్వే చేశారు. 272, 273, 274లో గల 20 ఎకరాలనే 279 నెంబర్‌ గల సర్వే నెంబర్‌ లో పేర్కొన్నట్లు గుర్తించారు. కొత్త సర్వే నెంబరు సష్టించిన విషయం అప్పుడు బయటపడింది.
తప్పు నాది కాదు నీదే...
అసైన్డ్‌ భూములు వెనక్కి ఇవ్వడంపై రాద్ధాంతం జరగడంతో ఆ తప్పిదం నుంచి తప్పుకోడానికి రెవెన్యూ అధికారులు పోటీపడుతున్నారు. తప్పు నాది కాదంటే నాది కాదంటూ ఒకరిపై మరొకరు తోసుకుంటున్నారు. అసైన్డ్‌ భూములను అటవీశాఖాధికారులకు కేటాయిస్తూ నాలుగేళ్ల కిందట అప్పటి తహసీల్దార్‌ వీవీఎస్‌ శర్మ ప్రపోజల్‌ సిద్ధం చేశారు. ఆ భూముల కేటాయింపుపై ఆయనను 'ప్రజాశక్తి' సంప్రదించగా, కేవలం ప్రపోజల్‌ వరకు పరిమితమయ్యానని, మిగిలినవేవీ తనకు సంబంధం లేదని చెప్పారు.
రైతుల్లో ఆందోళన...
15 ఏళ్ల కిందట తుప్పలు, రాళ్లతో నిండిన ప్రాంతాన్ని చదును చేసి, సాగులోకి తీసుకొచ్చామని రైతులు తెలిపారు. ఏటా జీడి, మామిడి పంటలతో వస్తున్న ఆదాయంతో తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నామన్నారు. ఇటువంటి సమయంలో భూములు వెనక్కి తీసుకోవ డం సరికాదని రైతులు వాపోతున్నారు. అసైన్డ్‌ భూముల చట్టం ప్రకారం వెనక్కి తీసుకున్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
రెవెన్యూ వల్ల మోసపోతున్నాం...
రెవెన్యూ ఉద్యోగులను నమ్ముతూ మోసపోతున్నాం.1993-95 రెండు రిజర్వాయర్ల కోసం అటవీశాఖ భూములకు బదులుగా సాలూరు రేంజ్‌ పరిధి ముచ్చర్ల వలస, పాలకొండ రేంజ్‌ జంపర కోట వద్ద భూములను అప్పగించారు. అవి కూడా వివాదాస్పద భూములు కావడంతో, పలువురు అటవీశాఖాధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇపుడు గొట్టివలస రెవెన్యూ పరిధిలోనూ ఇలాగే జరుగుతోంది. భూములు మాకు ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. మిగిలిన విషయాలతో మాకు సంబంధం లేదు. వివాదాస్పద భూములు తీసుకుని, మా భవిష్యత్తును నాశనం చేసుకోలేం.
జిఎపి ప్రసూన, జిల్లా ఫారెస్ట్‌ అధికారి