సరుకు (రక్త) హీనత..!
బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఆశయం కాంట్రాక్టర్ల నిర్వాకంతో నీరుగారిపోతోంది. మెరుగైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామంటూ బుకాయిస్తూనే ఏమాత్రం నాణ్యతలేని రేషన్‌బియ్యం, పామోలిన్, వాసనవస్తున్న పాలప్యాకెట్లు, చిన్నసైజు కోడిగుడ్లతోనే, పురుగులు పట్టిన చిక్కీలతోనే సరిపెడుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఆరోగ్య సర్వేల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 21 అంగన్‌వాడీ ప్రాజెక్టుల్లో 4100, తిరుపతి జిల్లాలలోని 2753 ఐసిడిఎస్ కేంద్రాల పరిధిలోని 70 శాతం మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలు. అయితే కలెక్టర్, డిఎంహెచ్‌ఒ, ఐసిడిఎస్ అధికారులు సైతం సమీక్షలతోనే సరిపెడుతున్నారు తప్ప పౌష్టికాహారం లబ్దిదారులకు నాణ్యతగా చేరుతుందా? లేదా? కాంట్రాక్టర్లు అందిస్తున్న ఆహారంపై దృష్టి పెట్టకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఫలితంగా అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలను, బాలింతలను, గర్భిణులను రక్తహీనత వెంటాడుతూనే ఉంది.
( ప్రజాశక్తి- తిరుపతి)
అందని 'సంపూర్ణ పోషణ'
గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తోంది. కిలో రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల వేరుశనగ చిక్కి, కిలో జొన్నపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కిలోల ఫోర్టిఫైడ్ రైస్, అరకిలో నూనె, అరకిలో పప్పు, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లతో కూడిన కిట్టులను అందజేస్తోంది. వీటన్నింటినీ డ్రైరేషన్‌గా లబ్ధిదారులకు అందిస్తున్నామని అటు అధికారులు, ప్రభుత్వం, ఇటు కాంట్రాక్టర్లు బుకాయిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా లబ్దిదారులకు చేరుతుండటం గమనార్హం.
పిల్లల ఆరోగ్యం పైనా దృష్టేదీ !
ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సుగల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలామతం, రెండున్నర లీటర్ల పాలు, 25 కోడిగుడ్లను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సమకూర్చుతోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహరాన్ని వంటచేసి పిల్లలకు వడ్డిస్తోంది. చిన్న పిల్లలకు సోమవారం, గురువారాల్లో పౌష్టికా హారం, కూరగాయల కూర, సాంబారు, కోడిగుడ్డు కూర, వంద లీటర్లపాలు, మంగళవారం, శుక్రవారా ల్లో పౌష్టికాహారం, పప్పు, తోటకూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలు, బుధ, శనివారాల్లో పౌష్టికాహారం, వెజిటబుల్ రైస్, పులిహౌరా, గోంగూర కూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలుతో కూడిన మెనూను అమలు చేస్తోంది. అయితే ఈ సరుకుల సరఫరాలో కాంట్రాక్టర్ల చేతివాటంతో నాణ్యమైన సరుకులు అందక పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించలేక వంటమ్మలు , అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం శోచనీయం. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక విద్యాకేంద్రాల్లోని పిల్లల్లోనూ దాదాపు 15 వేల మందికిపైగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తూతూ మంత్రంగా సర్వేలు చేసి కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప అవసరమైన పౌష్టికాహారాన్ని పూర్తిగా అందించలేకపోతున్నారని ప్రజాసంఘాలు వాపోతుండటం గమనార్హం. వైద్యరంగంలో రాయలసీమకే తలమానికంగా నిలుస్తున్న తిరుపతిలోని ప్రభుత్వ మెటర్నటీ చిన్నపిల్లల ఆస్పత్రికి వస్తున్న ప్రతి 100 మంది మహిళలు, చిన్నారుల్లో దాదాపు 70 నుంచి 80 శాతం మంది మహిళల్లో రక్తహీనత తలెత్తుతోందని, ప్రసవం సమయంలో అవసరానికి సరిపడా రక్తమూ దొరకడం లేదని సాక్షాత్తూ అక్కడి వైద్యులు చెబుతుండటం శోచనీయం. దీంతో రక్తం కోసం తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, వివి మహల్ రోడ్డులోని ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నుంచి ప్రతిరోజూ 150 నుంచి 200 యూనిట్లు వరకు తీసుకెళుతుండటం గమనార్హం.
కాంట్రాక్టర్లు నాణ్యతతో ఇవ్వాలి : వాణిశ్రీ, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి
బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు మెరుగైన పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పూర్తిస్థాయిలో లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం, ఇటు అధికారులదే. అయితే కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న సరుకుల నాణ్యతాలోపంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. నాణ్యత తలెత్తినప్పుడల్లా తరచూ అంగన్‌వాడీలనే నిందిస్తున్నారు తప్ప వాస్తవాలను గ్రహించడం లేదు. ఇప్పటికైనా మెరుగైన సరులకులను అందించాలి.
నాశిరకం పోషకాహార కిట్










