May 23,2023 22:19

సర్పంచి ఇంటిముందు రోడ్డులో నిల్వ ఉన్న మురుగునీరు

ప్రజాశక్తి. నల్లమాడ : మండల పరిధిలోని నల్లగొండ ఎనుములవారిపల్లిలో సర్పంచి ఇంటిముందరే నిల్వ ఉన్న మురుగు నీటికుంటను తలపిస్తోంది. సర్పంచి రెడ్డమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఇంటిలో నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి ఇంటిలోకి వెళ్లాలన్న మురుగు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వీరితోపాటు గ్రామస్తులందరూ ఈ మురుగునీటి మడుగు లో వెళ్లడం పరిపాటిగా మారింది. కొద్దిపాటి వర్షానికే ఈ వీధి అంతా మరుగునీటి మడుగులా తయారవుతోందని ఆ వీధి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచి నివాసముండే ఈ ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మురగునీరు ఇలానే ఉంటే దోమలు వృద్ధి చెందిన ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ వీధిలో సిమెంట్‌ రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా రోడ్డు ఏర్పాటుకు సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్‌ మెటీరియల్‌ కూడా సిద్ధం చేశాడు. అయితే సిమెంట్‌ రోడ్డు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని సర్పంచి రెడ్డమ్మ, ఆమె మామ రంగప్ప తెలిపారు.