Oct 10,2023 21:05

రేషన్‌ డిపోను పరిశీలిస్తున్న ఫుడ్‌కమిషన్‌ సభ్యులు కాంతారావు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ :  విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు శ్రమను ఆయుధంగా మలుచుకుంటే విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు బి.కాంతారావు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. జిల్లా పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కొత్తవలస వద్ద చౌక ధరల దుకాణాన్ని, అంగన్వాడీ కేంద్రం, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటకాల నాణ్యతను పరిశీలించి రుచి చూశారు. విద్యార్థులకు స్వయంగా పదార్థాలను వడ్డించారు. స్టోర్‌ రూంలో సరుకుల నిల్వలను, రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న గుడ్లు, చెక్కీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కొత్తవలస పెద్దవీధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి జగనన్న గోరుముద్ధ పథకం అమలు, సరుకుల నిల్వ, రికార్డుల నిర్వహణను తనిఖీ నిర్వహించారు. వండిన వంటకాల స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంత మంది బాలింతలు, గర్భిణీలకు పౌష్ఠికాహారం, టి.హెచ్‌.అర్‌ అందిస్తున్నది వివరాలను ఆరా తీశారు. రక్తహీనత లోపం తలెత్తకుండా బలవర్ధకమైన ఆహారాన్ని సక్రమంగా అందించాలని సూచించారు. పథకాల అమలు క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు జరిగేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లోపాలను సరిదిద్దుకుని ప్రభుత్వ ఆశయం నెరవేర్చేందుకు పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. అలాగే కొత్తవలస లోని చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైందని, ఆత్మ స్థైర్యంతో ముందడుగు వేయాలని అన్నారు. పేదరికం, ఆనారోగ్యంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి నాణ్యమైన విద్యతో పాటు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్‌.శివప్రసాద్‌, డిఎం ఎం.దేవుళ్లనాయక్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి టి.జగన్మోహన్‌రావు, జిల్లా మధ్యాహ్న భోజన పథకం సహాయ సంచాలకులు పి.దామోదర రావు, జిల్లా ఆహార భద్రత తనిఖీ ఇన్‌స్పెక్టర్‌ వై.రామయ్య, జిల్లా లీగల్‌ మెట్రాలజి ఇన్స్పెక్టర్‌ కె.రత్న రాజు, ప్రధానోపాధ్యాయులు జి.విశ్వం, ఉపాధ్యాయులు, తదితరులు, పాల్గొన్నారు.
పిఒను కలిసిన ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు
సీతంపేట :
రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు బి.కాంతారావు మంగళవారం ఐటిడిఎ పిఒ కల్పనకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పిఒ దష్టికి తీసుకురాగా, పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకొంటామని పిఒ హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు కాంతారావు సందర్శించారు. విద్యా ప్రమాణాలు అడిగి తెలుసుకున్నారు. మెనూ అమలు తీరును పరిశీలించారు అనంతరం సీతంపేట పాఠశాలను తనిఖీ చేపట్టారు. గురుకుల కళాశాల, ఆశ్రమ పాఠశాలల, కెజిబివి పాఠశాలలను సందర్శించారు. ఆయన వెంట శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల గిరిజనసంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్లు మంగ వేణి, శ్రీనివాసరావు డిప్యూటీ డిఇఓ లిల్లీరాణి. ప్రిన్సిపల్‌ తిరుపతిరాజు, ఎఎంఒ కోటి బాబు తదితరులు పాల్గొన్నారు.