శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ
- మహాశివరాత్రిని తలపించిన భక్తులు
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగి మహాశివరాత్రిని తలపించింది. క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండవ శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవు రోజులు కలిసి రావడంతో స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండి కాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లో శ్రీశైలం చేరుకున్నారు. తెల్లవారుజామున 4-30 గంటల నుండి స్వామి అమ్మ వార్లను దర్శించుకునేందుకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మహా మంగళహారతి అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. భక్తులు అడిగిన అన్ని ఇచ్చేందుకు లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. క్షేత్ర పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా కెమెరాలతో కంట్రోల్ రూమ్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు. క్షేత్ర పరిధిలో ఉన్న కమ్యూనిటీ సత్రాలు భక్తులతో నిండిపోయాయి. దేవస్థానం గదులు, కాటేజీలు, సత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇంకా అనేకమంది భక్తులు గదులు దొరకక ఇబ్బందులు పడ్డారు.










