చిలమత్తూరు : చిలమత్తూరు మండలంలో ఆన్‌సెటిల్డ్ భూములను అండంగల్‌లో లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌కు మారుస్తూ రెవెన్యూ అధికారులు చేసిన నిర్వాకంపై సోమవారం నాడు ప్రజాశక్తి పత్రికలో పక్కాగా ఏ'మార్చేశారు'..! అన్న శీర్షికతో వెలువడిన కథనం ప్రకంపనలు సృష్టించింది. ఈ కథనం వెలువడగానే సోమవారం నాడు మండల రెవెన్యూ అధికారుల్లో దడ పుట్టింది. ఉదయం తొమ్మిది గంటలకే అధికారులు కార్యాలయానికి చేరుకుని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. దీనికి తోడు రైతులు, ప్రజలకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వీరికి జనసేన నాయకులూ మద్దతు తెలిపారు. దీంతో ఉక్కిరిబిక్కరైన అధికారులు ఆన్‌లైన్‌లో పేరు మార్పునకు ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు తహశీల్దార్ చేరుకుని వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఫిరంగి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతుల పట్టా భూములను లేపాక్షి హబ్ పేరుపై ఎలా మార్చారో అధికారులు సమాధానం ఇవ్వాలన్నారు. మిగులు భూముల పేరుతో రైతుల పట్టా భూములను లాగేసుకునే కుట్ర జరుగుతోందన్నారు. ఒక వేళ మిగులు భూములు అయినా వాటిని లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు ఎలా బదలాయిస్తారని ప్రశ్నించారు. లేపాక్షి హబ్‌కు భూములు కట్టబెట్టే కుట్రకు అధికారులు సహకరిస్తుండడం దుర్మార్గమన్నారు. ఆన్‌లైన్‌లో అన్‌సెటిల్డ్ కింద ఉన్న భూములను యథావిధిగా అలానే ఉంచాలని ప్రశ్నించారు. దీనిపై తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ సాంకేతిక సమస్య వల్లనే ఈ పొరబాటు జరిగిందన్నారు. పొరపాటున అన్‌సెటిల్డ్ భూములన్నీ లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములుగా మారాయన్నారు. కొంత సమయం ఇస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇందుకు వ్యకాసం నాయకులు, రైతులు ఒప్పుకోలేదు. తాము కార్యాలయంలోనే ఉంటామని, వెంటనే సమస్యను పరిష్కరించక పోతే ఆందోళన ఉధతం చేస్తామని హెచ్చరించారు. దీంతో చేసేది లేక రెవెన్యూ అధికారులు మొత్తం ఈ సమస్య దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. అరగంట సమయంలో లేపాక్షి హబ్ పేరుపై ఉన్న భూములను యథాప్రకారం అన్‌సెటిల్డ్ పేరుపై అడంగల్‌లో మార్చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను గుర్తించి వెంటనే కథనాన్ని ప్రచురించిన ప్రజాశక్తికి, తమ పక్షాన పోరాటం సాగించిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం నాయకులు వెంకటేష్, సిపిఎం నాయకులు లక్ష్మినారాయణ, రామచంద్ర, జనసేన నాయకులు రమణ, చిన్నా, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.










