సర్దార్ గౌతు లచ్చన్న సభా ప్రాంగణంగా నామకరణం
ప్రజాశక్తి-ఉయ్యూరు
బహుజన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించాలని ఉన్నత స్థాయి ఎదగాలని ,తన జీవితకాలం కషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో ఆ మహనీయుని ఆశయ సాధనకు ఆ వర్గాల యువత ముందుకు రావాలని ఎపి బీసీ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు అన్నారు. ఉయ్యూరు బైపాస్ రోడ్డు అయ్యప్ప గుడి సమీపంలోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్‌లో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన బహుజన సాహిత్య అకాడమీ మూడో రాష్ట్రస్థాయి సమావేశాల ఏర్పాట్లకు బిఎస్‌ఎ స్థానిక ప్రతినిధులు బుధవారం శ్రీకారం చుట్టారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ నేతృత్వంలో సంస్థ ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం భారీగా జరగనుంది. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న సభా వేదికకు స్వాతంత్ర సమరయోధులు, బడుగు వర్గాల ఉద్యమ నేత సర్దార్ గౌతు లచ్చన్న సభా ప్రాంగణంగా నామకరణం చేశారు. బీసీ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు సర్దార్ గౌతులచ్చన్న సభా ప్రాంగణంగా తెలియజేసే బోర్డును ఆవిష్కరించారు. కీర్తిశేషులు గౌతు లచ్చన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాజు, గట్టు శివ, మైనార్టీ నాయకులు ఖలీల్ రెహమాన్, బిఎస్‌ఎ ప్రతినిధులు కాటూరి సురేష్,కె.గౌతమి, కోలా దుర్గా భవాని, నారగాని రజని తదితరులు పాల్గొన్నారు.










