Aug 04,2023 19:21

సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - కౌతాళం
శ్రావణమాస ఉత్సవాలను సమన్వయంతో జయప్రదం చేద్దామని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పాలకమండలి ఛైర్మన్‌ నాగరాజు గౌడ్‌, సహాయ కమిషనర్‌ వాణి కోరారు. శుక్రవారం ఉరుకుందలోని డార్మెటరీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నెలరోజుల పాటు జరిగే శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలకు ఆయా శాఖ అధికారులు సేవలు అందించడానికి సిద్ధం కావాలని కోరారు. ముందుగా శాఖల వారీగా పుణ్యక్షేత్రంలో వారి సేవలపై సమీక్షించారు. ఈనెల 17 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్‌, విద్యుత్‌, అగ్నిమాపక, ఆర్‌టిసి, ఆరోగ్య తదితర శాఖల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా సేవలు అందించాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ సిద్ధం చేయడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యుత్‌, తాగునీరు, రోడ్డు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరు ఆర్‌టిసి డిపోల నుంచి కండిషన్‌లో గల బస్సులను నడిపించాలని సూచించారు. ఆయా డిపో మేనేజర్లు మాట్లాడుతూ... డిపోల నుంచి నడిపించే బస్సులు నిలవడానికి బస్టాండ్‌ సౌకర్యంతో పాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడాలన్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు సహకరించాలని కోరారు. సుమారు 15 నుంచి 20 లక్షల వరకు భక్తులు రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు. సిఐ ఎరిషావలీ, ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి, తహశీల్దార్‌ రామేశ్వర్‌ రెడ్డి, ఎంపిడిఒ సుబ్బరాజు, ఎంపిపి అమ్రేష్‌, ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, పాలక మండలి సభ్యులు, ఉప ప్రధాన అర్చకులు మహదేవ, పూజన్న, ముఖ్య అర్చకులు నాగరాజు, శివన్న పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రంలో అభివృద్ధి ఎక్కడ..?
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ఆలయ ముఖ్య అర్చకులు శివన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... దేవాలయానికి రూ.కోట్లలో ఆదాయమున్నా, లక్షల్లో భక్తులు వస్తున్నా పుణ్యక్షేత్రంలో మాత్రం అభివృద్ధి జరగడం లేదని తెలిపారు. పుణ్యక్షేత్రానికి సమీపంలో తుంగభద్ర జలాలు పారుతున్నా, పుణ్యక్షేత్రంలో మాత్రం శాశ్వత తాగునీరు సౌకర్యం లేదన్నారు. సరైన డ్రెయినేజీ వ్యవస్థ కూడా లేదని పేర్కొన్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో భక్తులు వెంటనే వెనుదిరిగి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతత కోసం వచ్చే భక్తులకు స్వామి దర్శనం తప్ప ఎలాంటి సౌకర్యాలూ లేవన్నారు. రోడ్డు మార్గాలు సరిగ్గా లేకపోవడంతో పుణ్యక్షేత్రానికి రావాలంటే భక్తులు భయపడుతున్నారని తెలిపారు. శ్రీశైలం, తిరుపతి, మహానంది, యాగంటి పుణ్యక్షేత్రాలు లాగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పాలక మండలి ఛైర్మన్‌ నాగరాజు గౌడ్‌, సహాయ కమిషనర్‌ వాణిని కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్య అర్చకులు శివన్న
సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్య అర్చకులు శివన్న