సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావ
ప్రజాశక్తి కలక్టరేట్ (కష్ణా) : సమాజం ఆరోగ్యంగా ఉండాలని కష్టపడే సఫాయి కర్మచారీలకు వివిధ ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక సహాయము, బ్యాంకు రుణాలు ఉదారంగా అందించి వారి అభ్యున్నతికి తోడ్పడాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావ జిల్లా అధికారులకు సూచించారు.బుధవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గౌరవ సభ్యులు, కమిషన్ సామాజిక సలహాదారు గిరింద్రనాథ్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తో కలసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు డాక్టర్ పిపి వావ మాట్లాడుతూ సఫారీ కర్మచారీలను మానవులుగా పరిగణించి వారికి సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక సమానత్వం, కలగజేసి న్యాయం చేకూర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. మాన్యువల్ గా (చేతితో) స్కావెంజర్ వత్తి చేయరాదని స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేయిస్తే బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం జరిమానాలు, శిక్షలు విధించబడతాయన్నారు. మురికి కూపాలను శుభ్రం చేస్తూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతున్న సఫాయి కర్మచారీలకు పక్కా ఇళ్లను ఇవ్వాలని లేదా భూమి కొనుగోలు చేసి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. అలాగే వారి పిల్లల చదువు కోసం రాయితీలు కల్పించాలన్నారు.వారు ప్రస్తుతం చేస్తున్న వత్తిని వీడేందుకు వీలుగా వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం అందించి ఏదైనా కార్లు మెకానిక్ వర్క్ షాపులు తదితర వ్యాపారాలు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.బ్యాంకులు నాలుగు శాతం వడ్డీతో వారికి రుణాలు విరివిగా అందించాలన్నారు. వివిధ పథకాలు, బ్యాంకు రుణాల గురించి సఫాయి కర్మచారీలకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే వారికోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరాలను కూడా నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్యం అందించా లన్నారు. ప్రతి సఫాయి కర్మచారికి గుర్తింపు కార్డుతో పాటు అందులో ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ నంబర్లు తప్పకుండా ముద్రించాలన్నారు. ప్రతి ఒక్కరికి కనీస వేతనాల దక్కేలా చట్టాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో అన్ని పురపాలక సంఘాల్లో సఫాయి కర్మచారీల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారికి ఆర్థిక సహాయం అందించి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నామని, వారి పిల్లలకు చదువు కోసం కూడా అన్ని విధాల సహాయపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీహరి రావు, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.










