ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్య ఇస్తూన్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసి ,జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు ఆర్డీవో ఐ కిషోర్ కెఆర్‌ఆర్‌సి డిప్యూటీ కలెక్టర్ కె నారాయణ రెడ్డి లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించి అర్జీదారుడికి సకాలంలో న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇటువంటి ప్రాధాన్యత సంతరించుకున్న కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు హాజరు కాకుండా కిందిస్థాయి సిబ్బందిని పంపించడం పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెండింగ్ అర్జిల పై సమీక్షించారు. ఈ సమీక్షాలో మచిలీపట్నం నగర పాలక సంస్థ అధికారులు పని విధానంపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. స్పందన అర్జీలు పరిష్కరించడంలో నగర పాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విరు పని పద్దతులు మార్చుకోక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తంగా 95 అర్జీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
రూ. 5 లక్షల రుణ చెక్ ను అందజేత
స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకొన్న పెడనకు చెందిన అబ్దుల్ రహీమ్ కు నేషనల్ హ్యాండీక్యాప్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన రూ.5 లక్షల చెక్కును ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆయనకు అందించారు. ప్రతిభావంతులు, వయోవద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. రామ్ కుమార్, బందరు ఆర్డీఓ ఐ.కిషోర్, కేఆర్‌ఆర్సి డిప్యూటీ కలెక్టర్ బి.శివనారాయణ రెడ్డి, ఎస్సీ సాధికార సంస్థ జిల్లా అధికారి కే సరస్వతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.










