Jul 30,2023 21:06

అధికారులకు అందజేసిన అర్జీని చూపుతున్న బాధిత రైతు

'స్పందన' శూన్యం
- 12 సార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం కాని సమస్య
- అధికారులు స్పందించడం లేదని అర్జీదారులు అసహనం
ప్రజాశక్తి - నందికొట్కూరు

      ఏదైనా సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే 30 రోజుల్లోపు పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం 'స్పందన' కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో అనేక మంది బాధితులు సోమవారం వచ్చిందంటే చాలు కలెక్టరేట్‌, తహశీల్దార్‌ కార్యాలయం చేరుకుని వందల అర్జీలు అధికారులకు సమర్పించుకుంటుంటారు. అయితే అందులో ఎన్ని పరిష్కారమవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. సమస్యల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆచరణలో బాధితుల కష్టాలు మాత్రం యధావిధిగా ఉంటున్నాయి. కార్యాలయాల చుట్టు తమ సమస్య పరిష్కారం కోసం బాధితులు తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితులు క్షేత్ర స్థాయిలో నెలకొన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో ఈ కార్యక్రమం చురుగ్గా కనిపించినా రానురాను విమర్శలకు గురవుతుంది. నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా ఎటువంటి స్పందన ఉండడం లేదని అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదైనా పరిష్కారం లభించలేదని బాధితులు ప్రజాశక్తి దృష్టికి తీసుకొచ్చారు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన రైతు బెస్త రాజు పొలం సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు 12 సార్లు స్పందనలో అర్జీలు అధికారులకు సమర్పించుకున్నాడు. కొణిదేల గ్రామానికి చెందిన గుంతా లక్ష్మీనారాయణ, జి.బాల నాగయ్యలు రైతుల దగ్గర అప్పులు చేసి ఐపి పెట్టారు. గ్రామ ప్రజల సమక్షంలో గుంతా లక్ష్మీనారాయణ వారసత్వ రీత్యా దస్తావేజు నెం. 425/1975 వారి పెద్దల నుండి సంక్రమించిన ఆస్తికి సంబంధించి 2019 ఫిబ్రవరి 16న కొణిదెల గ్రామ రచ్చకట్ట వద్ద గ్రామ పెద్దలు వేలంపాట నిర్వహించారు. ఆ వేలం పాటలో కొణిదెల గ్రామానికి చెందిన బెస్త మల్లేశ్వరి, భర్త బెస్త రాజు నాగటూరు గ్రామ పొలిమేరలో గల సర్వే నెం. 343/1 నందు 3.09 ఎకరాలు రూ. 9 లక్షల 15 వేలకు కొనుగోలు చేశారు. గోగుల లక్ష్మీదేవి, భర్త గోగుల నాగశేషులు నాగటూరు గ్రామ పొలిమేరలో గల సర్వే నెం. 343/1లో 3.09 సెంట్లను రూ.10 లక్షల 15 వేలకు కొనుగోలు చేశారు. వీరు ఇరువురు వేలంపాటలో కొనుగోలు చేసిన భూమిని కంప్యూటర్‌ అడంగల్‌లో వారి పిల్లల పేరు మీదుగా నమోదు చేయాలని, ఆలాగే ఆ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు చేయాలని స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు 12 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఒకే సర్వేపై రెండు ఖాతాలు నమోదు కావడంతో వాటిని ఆన్‌లైన్‌ నుంచి తొలగించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నా నేటికి సమస్య పరిష్కారం కాలేదని అర్జీదారుడు రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్పందన కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుదారుల్లో అధిక శాతం మంది భూముల సమస్యలతోనే వస్తున్నారు. ఆర్థిక విషయాలతో సంబంధంలేని అంశాలను కూడా అధికారులు స్పందించి తీర్చకపోవడంపై బాధితులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా అధికారులైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు.