Jun 05,2023 17:46

స్పందనలో పాల్గొన్న ముగ్గురు అధికారులు

'స్పందన' కరువు
సంతకాలు సరే అధికారులు ఎక్కడ

ప్రజాశక్తి కొత్తపల్లి

మండల కేంద్రమైన కొత్తపల్లిలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి అధికారులు కరువయ్యారు. వచ్చిన అధికారులు రిజిస్టర్లలో సంతకాలు చేసి స్పందనలో కనిపించకపోవడం అధికారులు ఎక్కడ అని మండల ప్రజలు చర్చించుకుంటున్న సంఘటన చోటు చేసుకుంది. తహసిల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ నాయక్‌, ఎంపీడీవో మేరీ, హౌసింగ్‌ అధికారి మురళి తప్ప ఏ అధికారి కూడా కనిపించలేదు. వచ్చిన అధికారులు రిజిస్టర్లలో సంతకాలు చేసి వెళ్లిపోవడం వెనుక పనులు ఉన్నాయా లేక సంతకాలు చేసి వెళ్లిపోవాలన్న సంకల్పంతో వెళ్లిపోయారని స్పందనకు అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అన్ని శాఖల అధికారులు స్పందన కార్యక్రమం వద్ద ఉంటారని వచ్చిన ఫిర్యాదు దారులకు ఆశ అధికారులు లేకపోవడంతో నిరాశ మిగిలింది. ఇలా ఉంటే సమస్యలు పరిష్కారం ఎలా అవుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి రాబోవు రోజుల్లో స్పందన కార్యక్రమానికి పూర్తిస్థాయిలో అధికారులు పాల్గొని ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.