May 21,2023 22:54

ఆసుపత్రి, సమీప ప్రాంతాల నుంచి వస్తున్న విషతుల్య వ్యర్థాల నీరు

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ఏదైనా సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే 30 రోజుల్లోపు పరిష్కారం చూపడానికి 'స్పందన' అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.ఈ ప్రకటన చూసి బాధితులు అనేక మంది సోమవారం వచ్చిందంటే చాలు కలెక్టరేట్‌ కార్యాలయం చేరుకుని వందల అర్జీలు పెట్టుకుంటుంటారు. అయితే అందులో ఎన్ని పరిష్కారమవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. సమస్యల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆచరణలో బాధితుల కష్టాలు మాత్రం యధావిధిగాఉంటున్నాయి. కార్యాలయాల చుట్టు తమ సమస్య పరిష్కారం కోసం బాధితులు తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితులు క్షేత్ర స్థాయిలో నెలకొన్నాయి.. అటువంటి సమస్య ఒకటి ప్రజాశక్తి దృష్టికి బాధితులు తీసుకొచ్చారు.
ఏడాదైనా పరిష్కారం లభించలేదు
అనంతపురం రూరల్‌ మండలం పరిధిలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలో సవేరా కిమ్స్‌ ఆసుపత్రి ఉంది. దీంతోపాటు కొత్తగా అనేక అపార్టుమెంటులు జాతీయ రహదారికి ఆనుకుని సవేరా ఆసుపత్రి పక్కన ఏర్పాటయ్యాయి. కొత్తగా వెలుస్తున్న నివాస సముదాల నుంచి వచ్చే వ్యర్థాలు వెళ్లే డ్రయినేజీ వ్యవస్థ ఈ పంచాయతీ పరిధిలో లేదు. సహజ సిద్ధంగా ఏటవాలుగానున్న ప్రాంతాల్లోకి కిమ్స్‌ సవేరా ఆసుపత్రిలోని వ్యర్థాలతోపాటు, ఇతర సముదాయల వ్యర్థాలు లోతట్టు ప్రాంతాల్లో బయటకు వదిలేస్తున్నారు. ఇవి మరోచోటనున్న నివాస ప్రాంతాలతోపాటు, దిగువనున్న వ్యవసాయ భూములను ముంచేస్తున్నాయి. ఈ వ్యర్థాల మూలంగా జాతీయ రహదారి 42 ఆనుకుని ఉన్న తమ నివాస ప్రాంతమైన 'మైస్‌ విల్లాస్‌'లోని బోరు నీరు మొత్తం కలుషితమవుతోందని ఆ నివాస సంఘం అధ్యక్షులు రమణ తెలిపారు. దీనిపై ఆయన 2022 మే 30నకలెక్టరు కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశారు. ఎగువ ప్రాంతంలోని డ్రయినేజీ నీరు మొత్తం వచ్చి చేరడంతో తమ బోరులోనున్న నీరు మొత్తం కలుషితమై తాగడానికి కూడా పనికి రాకుండా ఉన్నాయని ఆ అర్జీలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మురుగునీటి కాలువ సౌకర్యం కల్పించాలని కోరారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం లభించలేదు. దీనిపై ఏమి చేయలో బాధితులకు పాలుపోక జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ జిల్లా అధికారులను ఆదేశించింది. ఇప్పటికైనా ఈ సమస్యపై స్పందన ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకమేనని బాధితులు రమణ తెలిపారు.
వ్యవసాయ పొలంలో చేరుతున్న మురుగు నీరు
రుద్రంపేట పంచాయతీ పరిధిలోనున్న సవేరా ఆసుపత్రి ప్రాంతం నుంచి వస్తున్న మురుగునీరు దిగువన జాతీయ రహదారి 42 కల్వర్లు కింద నుంచి కక్కలపల్లి పంచాయతీ పరిధిలోకి ప్రవేశించి ఒక వ్యవసాయ పొలంలోకి చేరుతోంది. అక్కడున్న మురుగు నీటి మూలంగా పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. గతేడాది ఈ రకంగా మూడు ఎకరాల్లో వేసిన మిరప పంట మొత్తం దెబ్బతిందని రైతు సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై బాధితుడు అనేక మార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా, అధికారుల, పంచాయతీ సర్పంచి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమ పొలంలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.
ప్రణాళిక లేమితో సమస్య...
ప్రణాళిక లేకుండా నూతన భవన నిర్మాణాలకు అనుమతులను ఆయా సంస్థలు ఇచ్చేస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం నగరం చూట్టూ ఉన్న ప్రాంతాల్లో నివాస సముదాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అందుకు తగ్గట్టు ఆయా ప్రాంతాల్లో మౌళిక సదుపాయల కల్పన జరగడం లేదు. ప్రధానంగా రహదారి, మురుగు నీటి వ్యసవ్థ ఏర్పాటు ఉండటం లేదు. దీంతో అనుమతులున్నాయని కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు తప్పడంలేదు. ముందు నుంచి వ్యవసాయ భూములు కలిగి ఉన్న వారి పొలాల్లోకి వ్యర్థాలను వదిలేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉంటున్న వారు సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు.