ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా): స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ.కిషోర్లతో కలిసి నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ పలు ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సానుకూలంగా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూసేకరణ, జగనన్న పాల వెల్లువ, గహ నిర్మాణం, ఉపాధి హామీ, ప్రాధాన్యత భవనాల నిర్మాణం, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై క్రమంతప్పకుండా సమీక్షిస్తున్నారని అందుకు సంబంధించిన పనులు వేగవంతం చేసి ప్రగతి నివేదికలు ప్రతి బుధవారం అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించిన లక్ష్యాలను సాధించే దిశగా పనులు శరవేగంగా జరగాలన్నారు. జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తూ చనిపోయిన ఉద్యోగస్తులకు సంబంధించి కారుణ్య నియామకాలను చేపట్టి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరంఉందన్నారు. ఇందుకోసం అధికారులందరూ వారి శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వెంటనే తెలపాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి చేపల పాటల సొసైటీ ఇచ్చిన సొమ్ము తో పాటు ఇంటి, నీటి పన్నులు బ్యాంకు ఖాతాలో జమ చేయలేదని, సరైన లెక్కలు చూపడం లేదని అనేక అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారని, దీనిపై సమగ్ర విచారణ చేసి గ్రామ పంచాయతీ సొమ్ము తిరిగి జమ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామపంచాయతీ సర్పంచ్ గల్లా అక్కయ్య ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










