Jul 24,2023 21:59

వినతిపత్రం అందజేస్తున్న టేకులోడు రైతులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఆర్‌బికె వద్ద సోమవారం నిర్వహించిన డివిజన్‌ స్థాయి స్పందనలో అదిక సంఖ్యలో అర్జీదారులు తమ అర్జీని ఇచ్చేందుకు పోటీ పడ్డారు. మండలంలో రీ సర్వే జరుగుతున్న నేపధ్యంలో భూ సంబందిత అర్జీలు ఎక్కువగా వచ్చాయి. డిపట్టా భూములు కొనుగొలు, తమ భూములును మరొకరు 1బిలో ఎక్కించుకున్నారన్న సమస్యలు,ఇంటి నిర్మాణం,ఇళ్ల స్థలాలు,రైతు భరోసా,పంట నష్టపరిహారం పై ఎక్కువ మంది అర్జీలు ఇచ్చారు. డివిజన్‌ స్థాయి స్పందన కావడంతో చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం నుండే కాకుండా గోరంట్ల,పరిగి,సోమందేపల్లి మండలాల నుండి కూడా ప్రజలు వచ్చి తమ అర్జీలకు అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కార్తిక్‌, తదితరులు పాల్గొన్నారు.
టేకులోడు భూములపై స్పష్టత ఇవ్వండి
గత రెండేళ్ల క్రితం టేకులోడులో సెజ్‌ పేరుతో 880 ఎకరాల భూమిని తీసుకుంటామని అధికారులు సర్వే చేశారు. గ్రామ సభలో ఎకరాకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇస్తామని తేల్చారు. కాని ఇప్పటి వరుకు ఎలాంటి ఉలుకు పలుకు లేదు.తాము సాగు చేసుకోవాలన్న,నీటి బోర్లు వేసి అబివృద్ధి చేసుకుందామంటే అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారని రైతులు వాపోయారు. ఇంతకీ ఆ భూములు తీసుకుంటారా లేదా స్పష్టం చేయాలని సబ్‌ కలెక్టర్‌ కార్తిక్‌ను కోరారు.ప్రభుత్వానికి భూములు అవసరం అయితే నోటిఫికేషన్‌ వదులుతామని అయితే ఇప్పటి వరకు నోటిపికేషన్‌ రాలేదంటే ప్రభుత్వానికి భూమి అవసరం లేదని అర్థం అని స్పష్టం చేశారు.దీంతో టేకులోడులో సెజ్‌ కు ఇప్పటిలో భూములు తీసుకునేది లేనట్లు స్పష్టం చేశారు.
కోడూరులో ఆసుపత్రిలో అదనపు భవనం నిర్మాణానికి వినతి
ప్రభుత్వం కోడూరులో పిహెచ్‌సి ఏర్పాటు చేయడానికి గతంలో భూమిని కేటాయించింది. ఇంకా నిర్మాణం కాక మునుపే ఇద్దరు డాక్టర్లను నియమించింది కాని అక్కడ నిర్మాణం లేదనే వంకతో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. కావున కొడికొండ చెక్పోస్ట్‌ లో ఉన్న టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ భవనం ఖాళీగా ఉంది. అందులో ఆసుపత్రి నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోడూరు సర్పంచి మురళీ స్పందనలో దరఖాస్తు చేశారు.
బత్తలపల్లి :ప్రతి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో అందే ఆర్జీలను తక్షణమే పరిష్కరించాలని తహశీల్దార్‌ యుగేశ్వరిదేవి పేర్కొన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంతో పాటు అన్ని గ్రామ సచివాలయాల్లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహశీల్దార్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి ప్రతి అధికారి తప్పక హాజరు కావాలన్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయ ఉద్యోగులు అందరూ హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.