ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎలాంటి జాప్యం చేయకుండా నిర్ణీత సమయానికే అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన స్పందన సమావేశ హాలులో జిల్లా రెవెన్యూ అధికారి ఎమ్.వెంకటేశ్వర్లు, కే ఆర్ ఆర్ సీ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ రెడ్డి, బందరు ఆర్డీవో ఐ.కిషోర్ లతో కలసి స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రజలు జిల్లా నలుమూలల నుంచి వస్తున్నారని, ఆయా శాఖల అధికారుల దష్టికి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని చెప్పారు. ఈ క్రమంలో అర్జీల సమస్యలపై ఆయన జిల్లాలోని ఆయా మండలాల తాహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని తహశీల్దార్లను ఆదేశించారు.










