Oct 17,2023 00:00

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : స్పందన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ ఎఎస్‌.దినేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అర్జీదారుల సంతప్తి ప్రామాణికంగా సకాలంలో వీటిని పరిష్కరించాలని తెలిపారు.కలెక్టరేట్‌ లోని స్పందన హాలులో సోమవారం 'డయల్‌ యువర్‌ కలెక్టర్‌' 'స్పందన' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమన్నారు. పిటిషన్లు రీఓపెన్‌ కాకుండా చూడాలన్నారు. సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. స్పందన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్‌, ఉమాదేవి, నారదముని, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు విశేష స్పందన
డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులపై కలెక్టర్‌ అక్కడికక్కడే సంబంధిత అధికా రులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
-దొనకొండ మండలం భూమనపల్లి నుంచి బి.రామసుబ్బయ్య ఫోన్‌ చేసి తన 4.60 ఎకరాల భూమిని సర్వే చేయాలని అధికారులను కోరగా, సర్వే చేయకుండా పక్కపొలం వారు అడ్డుకుంటున్నారని కలెక్టర్‌ దష్టికి తెచ్చారు. కలెక్టర్‌ స్పందిస్తూ అర్జీదారుని భూమిని సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
- కనిగిరి మండలం పునుగోడు నుంచి ఎం. సుబ్బారెడ్డి ఫోన్‌ చేసి తన భూమికి సంబంధించి ఆర్‌డిఒ కోర్టులో కేసు నడుస్తోందని, తహశీల్దారు రిపోర్టు పెండింగ్‌ లో ఉందన్నారు. రిపోర్టు త్వరగా ఇప్పించి తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.
- అర్ధవీడు మండలం పాపినేని పల్లి గ్రామం నుంచి బి.లింగన్న ఫోన్‌ చేసి తన పొలానికి నడిచి వెళ్లడానికి దారి లేకుండా చేశారని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి పరిష్కరించాలని స్థానిక అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.
- కొమరోలు మండలం రెడ్డిచెర్ల గ్రామం నుంచి ఎస్‌. పుల్లయ్య ఫోన్‌ చేసి రైతు భరోపా పథకానికి సంబంధించిన నగదు తన ఖాతాలో జమకాలేదని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ దష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ పరిశీలించి అర్హత మేరకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
- త్రిపురాంతకం మండలం రామసముద్రం నుంచి టి. నాసరరెడ్డి ఫోన్‌ చేసి తమ పొలం కొలవడానికి చలానా కట్టినప్పటికీ ఇప్పటివరకూ సర్వే చేయలేదన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ త్వరగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.