సాంకేతిక ప్రియులు ఎంతగానో ఎదురుచూసే టెక్ పండగ వచ్చేసింది. ప్రతి సంవత్సరం సరికొత్త మొబైళ్లు, గ్యాడ్జెట్లు, సాంకేతికతను ప్రపంచానికి పరిచయంచేసే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యుసి) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత సంవత్సరం కరోనా పరిస్థితుల రీత్యా ఈ టెక్ ఉత్సవాన్ని నిర్వహించలేదు. ఈ సంవత్సరం స్పెయిన్‌లోని బార్సిలోనాలో సోమవారం జూన్ 28 నుంచి జులై 1 వరకు వర్చువల్‌గా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి ఏడాది ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు, టెక్ కంపెనీలు పోటీపడి మరీ పాల్గొనేవి. ప్రముఖ కంపెనీలైన గూగుల్, నోకియా, షావోమి, ఫేస్బుక్, సోనీ లాంటి సంస్థలు హాజరు కాకపోవడంతో... ప్రతి ఏడాదిలా.. ఈ ఏడాది పోటీ వాతావరణం వుండే అవకాశంలేదు. అయినా... ఈ ఏడాది సరికొత్త టెక్నాలజీతో ఏ సంస్థలు... ఏయే పరికరాలను ఆవిష్కరించనున్నారో తెలుసుకోవాలనే ఉత్సుకత టెక్ ప్రియుల్లో నెలకొంది.
ఈ సంవత్సరం ఎండబ్ల్యుసిలో స్పేస్ఎక్స్ ఛీప్ ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టే ఇంటర్నెట్ శాటిలైట్ ప్రాజెక్టు స్టార్‌లింక్ హైలెట్‌గా నిలవనుంది. దీనిపై ఆయన ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడతారనే దానిపై టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శాంసంగ్ కంపెనీ నుంచి కొత్త మొబైల్స్ ఏమీ రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే స్మార్ట్ వాచ్‌ల సిరీస్‌లో కొత్తగా గెలాక్సీ వాచ్ 4ను ఈ ఈవెంట్లో ప్రదర్శించనుందని సమాచారం.
ఇంటెల్.. 5జీ విభాగాల్లో కొత్త ఉత్పత్తులు, సాంకేతికతకు సంబంధించిన కొత్త ఉత్పత్తులను ఎండబ్ల్యుసిలో ఆవిష్కరించనుండగా, లెనోవో... కొన్ని కొత్త ల్యాప్‌టాప్‌లు, క్రోమ్‌బుక్స్, కంప్యూటర్లకు సంబంధించిన యాక్సెసరీలను పరిచయం చేయనుంది. థింక్‌ప్యాడ్ ఎక్స్1 ఎక్స్ట్రీమ్ జెన్ 4, థింక్‌ప్యాడ్ ఎల్ 13 జెన్ 2, ఎల్ 13 యోగా జెన్ 2, ఐడియా ప్యాడ్ 5ఐ క్రోమ్ బుక్, ఐడియా ప్యాడ్ ఫ్లెక్స్ 5ఐ క్రోమ్ బుక్ 2 ఇన్ 1, లెనోవో గో పీసీ యాక్సెసరీలు ప్రదర్శనలో ఉండనున్నాయి.
అలాగే, టీసీఎల్... నెక్ట్స్వేర్ 'జి' పేరుతో స్మార్ట్గ్లాసెస్ని ఇందులో ప్రదర్శించనుంది. ఈ గ్లాసెస్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో చిన్నపాటి స్పీకర్లు ఉండడమే కాకుండా... మైక్రో ఓఎల్ఈడీ స్క్రీన్లు కూడా అమర్చబడి ఉన్నాయి. డీలింక్ కూడా తన కొత్త ఉత్పత్తులను ప్రదర్శించనుంది. 5జీ ప్రైవేట్ నెట్వర్క్స్, క్లౌడ్ మేనేజ్డ్ క్యాంపస్ నెట్వర్క్స్, ఎస్ఎంబీ నెట్వర్క్స్, స్మార్ట్ హౌం నెట్‌వర్క్స్‌ను ఈ ఈవెంట్లో ప్రదర్శించనుందని సమాచారం.
తమ కొత్త 5జీ ప్లాట్‌ఫామ్స్ గురించి వేదికపై వివరించడానికి ఎన్విడియా కూడా సిద్ధమవుతోంది. ఇటీవల రూపొందించిన ఆసక్తికరమైన 5జీ నెట్వర్క్ ఉత్పత్తుల గురించి ఇందులో వివరించడం జరుగుతుందని తెలుస్తోంది. హువావే నుంచి ఈ ఏడాది మరో కొత్త ఫోల్డబుల్ మొబైల్ రాబోతోంది. ఈ సరికొత్త మొబైల్ పీ50 రేంజిలో ఉంటుందని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
నాలుగురోజుల పాటు వర్చువల్‌గా నిర్వహిస్తోన్న ఈ మొబైల్ ఈవెంట్లో ఇంకా ఎలాంటి అద్భుతాలు చోటుచేసుకుంటాయో.... మొదటిరోజు తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశం వుందని సాంకేతిక ప్రియులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.










