పుట్టపర్తి రూరల్ : పోలీసు యంత్రాంగంలో స్పెషల్ బ్రాంచ్ సేవలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉండాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హలులో స్పెషల్ బ్రాంచి సిబ్బందితో శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్ రెండు కళ్ళు లాంటివన్నారు. ప్రమాదకరమైన సంఘటన విషయాలలో, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వాటిని సిబ్బంది, తమ దష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యమైన, సున్నితమైన సమాచార సేకరణలో స్పెషల్ బ్రాంచ్ ఎంతో విలువైనదని తెలిపారు. ఇందులో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఎల్లపుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోనే సంచరిస్తూ, స్థానిక ప్రజానీకం ఇతర అవకాశాల ద్వారా పక్క సమాచారాన్ని సేకరించాలన్నారు. అసాంఘిక శక్తుల వివరాలను ముందస్తుగా గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి, మట్కా , బెట్టింగ్‌పై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్‌బి ఫీల్డ్ సిబ్బంది అందరికీ షూష్, విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ రవీంద్రారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.










