ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ శానిటేషన్ సెక్రేటరీలు, మేస్త్రీలను ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేధం సాధ్యమేనా..? అనే శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ శుక్రవారం తన చాంబర్‌లో సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘ వ్యాప్తంగా 43 సచివాలయాలున్నాయని, ఎవరి సచివాలయ పరిదిలో వారు ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. దీని కోసం వార్డు అడ్మిన్ సెక్రటరీ, వార్డు వాలంటీర్లు ప్రత్యేక టీములుగా ఏర్పాటై తనఖీలు ముమ్మరం చేయాలన్నారు. వీరితో పాటు మున్సిపల్ అధికారులు సైతం మెయిన్ బజారు, బెంగళూరు రోడ్డు, విడి రోడ్డు తదితర ప్రాంతాల్లో అకస్మిక తనఖీలు నిర్వహిస్తారన్నారు. ఇకపై ఎవరి సచివాలయ పరిధిలో అయినా నిషేదిత ప్లాస్టిక్ ఉంటే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పని సరిగా ఎన్‌జిటి నిబందనలు అమలు చేయాల్సిన బాధ్యత శానిటేషన్ సెక్రటరీలపై ఉందన్నారు. నిబందనలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సమగ్ర మార్పులు తీసుకువస్తాం :పురపాలక సంఘ వ్యాప్తంగా నెల రోజుల్లో పారిశుధ్యంలో సమగ్ర మార్పులు తీసుకు వస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. పట్టణ పారిశుధ్యంపై ఆయన మాట్లాడుతు తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అయితే మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందన్నారు. దీని కోసం వారంలో ఆరు రోజులు గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారిశుధ్య విభాగంలో ఏడుగురు మేస్త్రీలున్నారని వారిని వార్డుల వారిగా విభజించి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గ్యాంగ్ వర్క్ చేయించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పట్టణంలోని ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు శుభ్రం చేయించాలని మేస్త్రీలకు, శానిటేషన్ సెక్రేటరీలకు సూచించామన్నారు. దీంతో పాటు ఇంటింటి చెత్త సేకరణపై సైతం దృష్టి సారించామన్నారు. ఇంటి నుంచి చెత్తను సేకరించిన అనంతరం ఇంటి నెంబరుతో పాటు వారి సంతకాన్ని ప్రత్యేక రిజిస్టర్‌లో తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.










