Sep 07,2023 22:39

గుత్తి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు

      గుత్తి : రాష్ట్రంలో సంపదను సష్టించి ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం గుత్తికి వచ్చారు. ముందుగా పట్టణ శివారులో అసంతప్తిగా నిలిచిపోయిన మీడ్‌ పెన్నార్‌ తాగునీటి ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. అక్కడ చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం పట్టణంలోని రాజీవ్‌ గాంధీ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలే నాకు బలం ప్రజలే నా సైన్యం అన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో సైకో పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నిత్యావసర వస్తువులు, పెట్రో విద్యుత్‌ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది అన్నారు. ప్రజలకి జగన్‌ రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడని ఆరోపించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతానన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటు చేసి ఎందరికో ఉపాధి కల్పించామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.69 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. అరాచక ప్రభుత్వం ఎంతో చరిత్ర గల గుత్తి చెరువుకు సాగునీరు అందించలేకపోతుందన్నారు. జిల్లాలోని అన్ని చెరువులు, ప్రతి ఎకరానికీ సాగునీరు అందిస్తామన్నారు. గుత్తి మున్సిపాలిటీలో శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం రూ.173 కోట్లతో తాము మిడ్‌ పెన్నార్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన వైసిపి ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లు గడిచినా పూర్తి చేయలేక పోయిందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రతి ఇంటికీ తాగునీటిని ఉచితంగా అందిస్తామన్నారు. తమ హయాంలో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసే వారమన్నారు. అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి వినియోగాన్ని పెంచే వారమన్నారు. తాము ఐటి ఉద్యోగం ఇస్తే జగన్‌ వాలంటరీ ఉద్యోగం ఇచ్చాడని ఎద్దేవా చేశారు. రైతును రాజు చేసే బాధ్యత తమపై ఉందన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే సోదరులుచ బంధువులు ఆరు మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఉన్నారని వారందరూ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. బేడ బుడగ జంగాల సామాజిక వర్గయులకు కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సైకో జగన్‌ని ఇంటికి పంపి టిడిపికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌.జితేంద్ర గౌడ్‌, ప్రభాకర్‌ చౌదరి, జెసి.ప్రభాకర్‌ రెడ్డి, టిడిపి నాయకులు వెంకటశివుడు యాదవ్‌, జీవానంద రెడ్డి, కేసీ.హరి, మండల, పట్టణ కన్వీనర్లు బర్దీవలి, రవిశంకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.