Apr 12,2023 21:59

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జగనన్నే మా భవిష్యత్తు అనే బదులు జగనన్నే మోసం అని పెట్టుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం టిడిపి స్థానిక కార్యాలయంలో పల్లె విలేకరులతో మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని ఈ కార్యక్రమం చేపట్టిందని ప్రశ్నించారు. జగన్‌ సంక్షేమం ముసుగులో ఇష్టానుసారం ధరలు పెంచారన్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నట్లు ఉందన్నారు. ఇసుక, స్టీలు, మద్యం, గ్యాస్‌, విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెంచేసి నిఆ్యవసర వస్తువులను సామాన్యుడు కొనలేని స్థితికి తెచ్చారన్నారు. అన్నా క్యాంటీన్‌ రద్దు చేశారని, సంక్రాంతి కానుక, రంజన్‌ తోఫా, నిరుద్యోగ భృతి ఇలా పేదలకు అందే పథకాలన్నీ రద్దు చేశారన్నారు. అప్పుల మీద అప్పులు తెచ్చి ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వలేని స్థితికి ఈ ప్రభుత్వం చేరుకుందన్నారు. ఈరోజు సగటున రాష్ట్రంలో ప్రజలందరికీ తలకు రూ. 3.70 లక్షల అప్పు పడుతుందన్నారు. టిట్కో గహాలకు నేటికీ మోక్షం లేదని, ఇప్పుడు పేదలకు ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టిస్తున్నానని చెబుతున్న ప్రభుత్వం ఎక్కడైనా పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. అనుభవం లేని వాడు లారీ తోలితే ఎలా ఉంటుందో జగన్‌ పాలన అలా ఉందని వ్యాఖ్యానించారు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, నాయకులు కోనంకి గంగాధర్‌, దారపునేని చంద్రశేఖర్‌, గూడూరు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.