Sep 14,2023 21:20

ఆర్‌బికె కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

సాలూరు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు డిప్యూటీ సిఎం రాజన్నదొర చెప్పారు. మండలంలోని పెద బోరబంద పంచాయతీ పరిధిలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల లబ్ధి గురించి వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి జి.రాములమ్మ, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ రెడ్డి పద్మావతి, జెసిఎస్‌ కన్వీనర్‌ కె.త్రినాధనాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్‌ కె.మన్మధరావు అధికారులు పాల్గొన్నారు.