Apr 10,2023 22:18

జగనన్న కాలనీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

    ప్రజాశక్తి-తలుపుల   ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ, అభివృద్ధిని రెండు కళ్లలా భావించి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని తలుపుల-1 సచివాలయం పరిధిలో ఉన్న సంఘం బజార్‌, బలిజపేటలో జడ్పీఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మతో కలిసి 'మా నమ్మకం నువ్వే జగన్‌' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వం పథకాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా సిమెంట్‌, కాంక్రీట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు నిర్మించడంతోపాటు ఎలక్ట్రికల్‌ పోల్స్‌ వేయించాలని స్థానికులు కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా సిఎం జగన్‌ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారన్నారు. దీంతో ప్రతి ఇంటికీ పథకాలు చేరుతున్నాయన్నారు. వీటన్నిటినీ చూసి ఓర్వలేని చంద్రబాబు, వారి దుష్టచతుష్టయం బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వాటిని ప్రజలు తిప్పి కొట్టాని పిలుపునిచ్చారు. అనంతరం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 82960 82960కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి ఐవిఆర్‌ఎస్‌ ద్వారా సిఎం జగన్‌ సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిలు, జడ్పీటీసీలు, వైస్‌ఎంపీపీలు, కో ఆప్షన్‌ సభ్యులు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగనన్న కాలనీ పరిశీలన
మండల కేంద్రం సమీపంలోని గంజివారిపల్లి రోడ్డు వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులకు అందజేసిన ఇంటి స్థలాల్లో నిర్మాణాలు చేపట్టే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.