ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023-24 ను కలెక్టరేట్‌లో కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్‌డిఒ భాగ్యరేఖ, డిఇఒ మీనాక్షి, డిపిఆర్‌ఒ వేలాయుధం తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ క్యాలెండర్లలో వివరించడం చాలా బాగుందన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సూచనల మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏ నెలలో ఏయే పథకాలు అమలు చేయాలో వాటి వివరాలు ఇందులో పొందుపరచాలన్నారు.
స్పందన అర్జీలను గడువులోగా పరిష్కరించాలి : స్పందన గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి కలెక్టర్ 171 అర్జీలను స్వీకరించారు. స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోందన్నారు. ఇందులో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ సమస్యలు, సూచనలను 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని అన్నారు. రీ ఓపెన్ పిటిషన్లు 51 ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని చెప్పారు. ప్రతి అధికారి అర్జీదారుతో వ్యక్తిగతంగా మాట్లాడి పరిష్కరించి తిరిగి పిటిషన్ రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రైతు భరోసా కేంద్రాలలో పోస్టర్లు ప్రదర్శించాలి
జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో పట్టు పరిశ్రమ శాఖ చేపడుతున్న పనులు, పథకాలకు సంబంధించి అన్ని రకాల పోస్టర్లను ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టు పరిశ్రమ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందేందుకు మల్బరీ తోటలో పాటించవలసిన సూచనలు, ఇతర పథకాలు వివరించే ఐదు రకాల పోస్టర్లను ప్రదర్శించడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెసి చేతన్, డిఆర్‌ఒకొండయ్య, పట్టు పరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్‌డిఒ భాగ్యరేఖ, సిపిఒ విజరు కుమార్, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి సుబ్బారావు, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, ఎడి శుభదాస్ తదితరులు పాల్గొన్నారు.










