ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనకు మరోసారి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత అన్నారు. మండలంలోని పెనకనమెట్ట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనితతోపాటు, ఎంపి మార్గాని భరత్ రామ్, ఎంఎల్‌ఎలు జి.శ్రీనివాస నాయుడు, జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ లక్ష్యంగా సిఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేసే దిశలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. గత నాలుగున్నర సంవత్సర కాలంలో పేదల బ్యాంకు ఖాతాలో రూ.2,35,000 లక్షలను జమ చేశామన్నారు. ఇంటి వద్దకె సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. జనవరి నుంచి రూ.3 వేల చొప్పున సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 87 శాతం మంది ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం వెనుక ప్రజలు ఉంటారనే నమ్మకంతోనే తాము ముందుకు వస్తున్నామని తెలిపారు.










